డ్రగ్స్‌ లేని సమాజాన్ని నిర్మిద్దాం

Sep 30,2024 21:32

ప్రజాశక్తి-బొబ్బిలి:  డ్రగ్స్‌ లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని సినీనటుడు సాయికుమార్‌ పిలుపునిచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మాదకద్రవ్యాల నివారణకు బొబ్బిలి పట్టణంలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాల నుంచి సూర్య రెసిడెన్సీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్రగ్స్‌తో కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని యువత, విద్యార్థులను కోరారు. ఒత్తిడిని ఎదుర్కొంటే మంచి భవిష్యత్తును పొందవచ్చని చెప్పారు. డబ్బింగ్‌ చెపుతూ మొదటి సంపాదన రూ.250 తీసుకుని తల్లికి ఇస్తే ఎంతో ఆనందం పొందినట్లు గుర్తుచేశారు. తెలిసో తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని కోరారు. దేశ రక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. సొసైటీని మంచి మార్గంలో నడిపించేందుకు సినిమా పాత్రల్లో నటిస్తున్నానని వెల్లడించారు.ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌పై సమాచారం కోసం కళాశాలలో డ్రాప్‌ బాక్స్‌ పెడతామని, డ్రగ్స్‌ వినియోగం, అమ్మకాలపై లిఖిత పూర్వకంగా అందులో వేయాలని కోరారు. డిఎస్‌పి పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గంజాయి తాగితే 6 నెలలు, రవాణా చేసినా, విక్రయించినా 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు. అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మిస్తామని విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో చీపురుపల్లి డిఎస్‌పి రాఘవులు, వాసు విద్యాసంస్థల కరస్పాండెంట్‌ రౌతు వాసుదేవరావు, తాండ్ర పాపారాయ కళాశాల కరస్పాండెంట్‌ తూముల కార్తీక్‌, సిఐలు బి.వెంకటరావు, కె.సతీష్‌కుమార్‌, ఎస్‌ఐలు జ్ఞానప్రసాద్‌, వి.ప్రసాద్‌, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️