ఏచూరి ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిద్దాం

Oct 3,2024 21:38

ప్రజాశక్తి-శృంగవరపుకోట : సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్యమ వారసత్వాన్ని కొనసాగించడమే మనం ఆయనకిచ్చే ఘన నివాళని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. మండలంలో పోతనపల్లి జంక్షన్‌ వద్ద పెయింటర్ల కార్మిక సంఘం నాయకులు వజ్రపు అప్పారావు ఆధ్వర్యంలో గురువారం సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా జంక్షన్‌లో సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ సీతారాం ఏచూరి మరణం కష్టజీవులందరికీ, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. 18 రోజుల నుంచి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయన సంస్మరణ సభలను నిర్వహిస్తుండటమే అందుకు నిదర్శనమన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా, బిజెపి విష కౌగిలి నుంచి దేశానికి విముక్తి కలిగించాలని ఇండియా బ్లాక్‌ ఏర్పాటుకు ఏచూరి కృషి చేశారన్నారు. అటువంటి మహానేత ఆశయాలను నెరవేరుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు టి.వి.రమణ, సీతంపేట పాల సొసైటీ చైర్మన్‌ వి.సన్యాసప్పడు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు, ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, నాయకులు ముత్యాలు, భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️