మాదక ద్రవ్యాలను ‘సంకల్పం’తో దూరం చేద్దాం

Nov 30,2024 20:32

ప్రజాశక్తి- నెల్లిమర్ల : మాదక ద్రవ్యాల అలవాటును సంకల్పం కార్యక్రమంతో దూరం చేద్దామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి, వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంకల్పం’ కార్యక్రమాన్ని శనివారం మిమ్స్‌ వైద్య కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులే రేపటి భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులని, అటువంటి విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, జీవితాలు నాశనం చేసుకోకూడదని అన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితం చేయాలన్న ఉద్దేశ్యంతో డిజి స్థాయి పోలీసు అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ‘ఈగల్‌’ పేరుతో పోలీసుశాఖ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ప్రారంభించిందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు 1972 అన్న టోల్‌ ఫ్రీ నంబరును కూడా ఏర్పాటు చేసామన్నారు. ఎవరైనా ఈ నంబరుకు మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణ, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తే నగదు బహుమతులను కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా వాటి వెనుక దురదృష్టవసాత్తు డ్రగ్స్‌ ప్రభావం కనిపిస్తుందన్నారు. డ్రగ్స్‌ ప్రభావాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గంజాయి, డ్రగ్స్‌ మితిమీరి వినియోగిస్తే, మత్తు ప్రభావంతో విచక్షణ కోల్పోయి, నేరాలకు పాల్పడుతున్నారన్నారు. కళాశాల యాజమాన్యాలు కూడా డ్రగ్స్‌ ఫ్రీ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ తమ విద్యాసంస్థలను నడిపేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గంజాయిని సమూలంగా నాశనం చేసేందుకు డ్రోన్స్‌ సహాయంతో గంజాయి పంటలను నాశనం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ పల్లి శ్రీనివాస్‌, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, మిమ్స్‌ చైర్మన్‌ అల్లూరి సత్యనారాయణ రాజు, ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మత్తుతో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఆర్‌డిఒ

చీపురుపల్లి: మత్తులో మునిగి యువత తమ జీవితాలను నాశనం చేసుకో వద్దని ఆర్‌డిఒ జివి సత్యవాణి అన్నారు. మాదక ద్రవ్యాలు, ఎయిడ్స్‌ నియంత్రణపై మానవీయత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రాధామాధవ ఫంక్షన్‌ హాలులో శనివారం జరిగిన అవగాహన కార్యక్రమంలో చీపురుపల్లి డిఎస్‌పి ఎస్‌ రాఘవులు, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆర్‌.కుమార్‌, సిఐ శంకరరావులతో కలసి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు ఏ లక్ష్యంతోనైతే కళాశాలలకు చదువుకునేందుకు పంపుతున్నారో ఆ లక్ష్య సాధన కోసం విద్యార్ధులు ప్రయత్నం చేయాలన్నారు. డిఎస్‌పి రాఘవులు మాట్లాడుతూ డ్రగ్స్‌ వలలో ఒకసారి చిక్కుకుంటే అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టమన్నారు. ప్రధానంగా యువత ఎక్కువగా ఈ డ్రగ్స్‌కి అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. వైద్యలు ఆర్‌.కుమార్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌పై యువతకు అవగాహన ఉండాలన్నారు. అంతకుముందు గాంధీ బొమ్మ జంక్షన్‌ నుంచి రాధామాధవ ఫంక్షన్‌ హాలు వరకు ఎయిడ్స్‌, డ్రగ్స్‌ నియంత్రణపై భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మానవీయత స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు బివి గోవింద రాజులు, మీసాల లక్ష్మణరావు, డోల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️