భూకంపంపై మాక్‌ డ్రిల్‌

Apr 16,2025 21:05

ప్రజాశక్తి- భోగాపురం : విపత్తుల నిర్వహణలో భాగంగా బుధవారం మండలంలోని చేపల కంచేరు ఎంపియూపి పాఠశాల వద్ద భూకంపం పై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. భూకంపం సంభవించినపుడు భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేపడతారనే అంశాలను ప్రదర్శించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఐ చంద్ర శేఖర్‌ నేతృత్వంలో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. భూకంపం వచ్చినందున ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ భూకంపాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, అత్యవసర వాహనాల్లో ఆసుపత్రికి తరలించడం వంటి కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. భూకంపం సంభవించినపుడు అగ్ని ప్రమాదాలు జరిగితే ఏ విధంగా ప్రజలు తమను తాము రక్షించుకోవాలో కూడా మాక్‌ డ్రిల్‌ చేసి చూపించారు. ప్రకృతి వైపరిత్యాలు జరిగినపుడు ప్రాణ నష్టం, ధన నష్టం జరగకుండా ఎలా చర్యలు చేపడతామనే అంశాల పై 17 శాఖలకు చెందిన అధికారులు వారి శాఖాపరమైన ప్రణాళికలు వివరించారు. అనంతరం బీచ్‌ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించడం, తుఫాన్లు, వరదలు సంభవించినపుడు ప్రజలు ఎలా అప్రమతంగా ఉండాలనే అంశాలను అవగాహన కలిగించారు. అగ్నిమాపక శాఖ ద్వారా గ్యాస్‌ సిలెండర్‌ లీక్‌ అయినపుడు, వంట గదిలో అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఎలా అదుపు చేయాలో వివరించారు. మేడపై చిక్కుకున్నవారిని రోప్‌ సహాయంతో ఎలా రక్షించాలో చేసి చూపించారు. ఈ మాక్‌ డ్రిల్‌లో ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందం, అగ్నిమాపక శాఖలు విపత్తుల సమయంలో వారు వినియోగించే ఎక్విప్మెంట్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ డిపిఎం రాజేశ్వరి, జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రకాష్‌, తహశీల్దార్‌ సురేష్‌, విపత్తుల శాఖ పర్యవేక్షకులు రామకృష్ణ, పశుసంవర్ధక శాఖ, మత్స్య, ఆరోగ్య, పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతి రాజ్‌, ఆర్‌అండ్‌బి, ఐసిడిఎస్‌, విద్యుత్‌, ఇరిగేషన్‌, ఆర్‌డబ్లుఎఎస్‌ తదితర శాఖలకు చెందిన అధికారులు, చేపల కంచేరు సర్పంచ్‌ నరసింగరావు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️