మాధవరాయమెట్టకు అనారోగ్యం

Feb 8,2025 21:11

ప్రజాశక్తి – జామి : జామి మండల కేంద్రంలోని మాధవరాయమెట్ట అనారోగ్యం బారిన పడింది. కిడ్నీ వ్యాధుల బారిన కొందరు, టిబి, శ్వాస సంబంధిత వ్యాధులతో మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ఒకప్పుడు ఉపాధి కల్పించే క్వారీలు, స్టోన్‌ క్రషర్లు నేడు మృత్యు శకటాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే మాధవరాయమెట్టకు అనారోగ్యం సోకిందని జనం గగ్గోలు పెడుతున్నారు. అది 1980 నాటి కాలం. జామి గ్రామ శివారున చిన్న గుడిసెలు వేసుకుని జీవించే కార్మిక కుటుంబాలవి. అరకు, అనంతగిరి, ఒడిశా ప్రాంతాల నుంచి క్వారీ పనుల కోసం వచ్చిన వారే ఎక్కువ. అత్యధికులు దళిత, గిరిజన కుటుంబాలే. ఒకరిద్దరితో మొదలైన కాలనీ నేడు 150 ఇళ్లకు చేరింది. అలాంటి కాలనీ వాసులకు కిడ్నీ మహమ్మారి సోకింది. సుమారుగా పది మంది వరకు కిడ్నీ వ్యాధితో చనిపోయారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. టిబి, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి చనిపోయిన వారూ ఉన్నారు. కాలనీ చుట్టూ స్టోన్‌ క్రషర్లు వెదజల్లే దుమ్ము, ధూళి వల్లే కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నారని జనం గగ్గోలు పెడుతున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉపాధినిచ్చే క్వారీలే ఉసురు తీస్తున్నాయిఒకప్పుడు జామి క్వారీల్లో కాలనీ వాసులకు చేతినిండా పని దొరికేది. కానీ నేడు యంత్రాల వాడకం అందుబాటులోకి వచ్చాక కాంట్రాక్టర్లు జనాలను పనుల నుంచి తప్పించారు. పనులకు దూరమైన జనానికి, క్రషర్లు వెదజల్లే దుమ్ము, ధూళి శాపంగా మారాయి. అడ్డగోలు బ్లాస్టింగులు జనానికి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. మాధవరాయమెట్ట గ్రామానికి అడుగుల దూరంలో ఉన్న కపిల్‌ కాంక్రీట్‌ స్టోన్‌ క్రషర్‌ గతం కన్నా వందల రెట్లు సామర్థ్యం పెంచుకుని కాలనీపై విచ్చలవిడిగా వ్యర్థాలు వదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాలనీ వాసులు రకరకాల రోగాల బారిన పడి చనిపోతున్నారని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నా, వినే నాథుడే లేరు.
కిడ్నీ వ్యాధికి బలైన వారు వీరే..
కాలనీలో కిడ్నీ బారిన పడి మొదట యువకుడు పిట్టా రాంబాబు మృత్యువాత పడ్డాడు. ఆ తర్వాత ఎద్దు గురుమూర్తి, మిడతాన దాలయ్య, పైడివోలి మాణిక్యం, కొట్యాడ అప్పారావు, కొర్రా కాంతమ్మ, బడినేని అప్పారావు, వంతల ఘాసి.. ఇలా ఈ ఐదేళ్లలో చనిపోయిన వారిలో అత్యధులు కిడ్నీ వ్యాధితోనే. తాజాగా గుజ్జెల సునీయా, వంతల మల్లన్న శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడి, హఠాత్తుగా మరణించారు. ఇంకా అనేక మంది రోగాల బారిన పడి అవస్థలు పడుతున్నారు.
స్టోన్‌ క్రషర్‌ దుమ్ముతో నిండిపోతుంది
కాలనీకి అతి సమీపంలో స్టోన్‌ క్రషర్‌ ఉంది. దాని నుంచి నిత్యం దుమ్ము, ధూళి వస్తోంది. దీనివల్ల ప్రజలు రోగాల పాలవుతున్నారని అధికారులకు ఫిర్యాదులు చేసినా, ఎవరూ పట్టించుకోవడం లేదు. – కొర్రా నీలన్న,గిరిజన క్వారీ కార్మికుడు
గ్రీవెన్స్‌ ఫిర్యాదులు బుట్టదాఖలు
కలెక్టర్‌ గ్రీవెన్సులో ఇప్పటికి అనేక సార్లు ఫిర్యాదులు చేశాం. క్రషర్‌ వల్లే రోగాలు వస్తున్నాయి. అధికారులు వచ్చి, జనం కన్నా క్రషరే ముందు ఉందని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే, కాలనీని వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నాం. – వంతల వెంకటి, గిరిజనుడు

➡️