రబీలో మొక్కజొన్న సాగు చేస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. రైతులు పొలంలో కష్టించి పని చేయడంతో పాటు, ఎన్నో అప్పులు చేసి వేలాది ఎకరాలలో మొక్కజొన్న వేసినప్పటికీ తెగుళ్లు రావడంతో నిరాశ చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరిగినప్పటికీ తెగుళ్లు సోకవడంతో నిరాశ చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా తెగుళ్లు బారిన పడి మొక్కలు కుళ్లిపోతున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రజాశక్తి-వంగర: మండలంలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, అపరాల పంటలు రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. రబీలో మొక్కజొన్న పంట వేస్తే లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో కింజంగి, మరువాడ, సీతాదేవి పురం, ఓని అగ్రహారం, ఎం సీతారాంపురం తలగాం, తదితర గ్రామాల్లో 1646 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. అయితే ఇటీవల భారీ వర్షాలు కురవడంతో కొంతమంది రైతులు వేసిన మొక్కజొన్న విత్తనాలు మొలకలు వచ్చి కుళ్లిపోయాయి. మరికొంతమంది రైతులు పొలంలో వేసిన విత్తనాలు మొలకలు వచ్చి ఏపుగా పెరిగినప్పటికీ తెగుళ్ల బారిన పడి కుళ్లి పోతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. అప్పులు చేసి వేలాది రూపాయలు మదుపులు పెట్టిన రైతులు నష్టాలు చవి చూడడంతో ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టిన మదుపులంతా రాకపోయినా కనీసం విత్తనాలు ఖర్చు అయిన రాదని తెలిసి రైతులు కన్నీరు పెడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొంతమంది రైతులు వేరొక రైతులు దగ్గర కొంత భూమిని కౌలకు తీసుకొని మొక్కజొన్న సాగు చేసినప్పటికీ పంటనష్టం రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెసర మినుము పంటల పరిస్థితి అంతే మండలంలోని మద్దివలస, కొప్పరవలస, కొత్తవలస, కొప్పర రుషింగి, తదితర గ్రామాలలో వరి పంట పూర్తయిన తరువాత అపరాలు వేశారు. మొక్కలు బాగా పెరిగినప్పటికీ ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పెసర మినుప పంటలు కు నష్టం వాటిల్లందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఊహించని పరిస్థితి నేను సుమారు రెండు ఎకరాలలో మొక్కజొన్న వేశాను. ఎకరాకు 15వేల రూపాయలకు పైబడి అప్పులు చేసి మదుపులు పెట్టినప్పటికీ ఎన్నడూ లేని విధంగా రబీలో వర్షాలు కురవడం వలన ఊహించని పరిస్థితుల్లో పంట పూర్తిగా నష్టం జరిగింది. గుంట కృపారావు, కింజంగి గ్రామం.ప్రభుత్వం ఆదుకోవాలినేను మూడు ఎకరాలలో మొక్కజొన్న వేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు పంట మొత్తం పాడై నష్టం వాటిల్లింది. రైతులకు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలి.బోను రామారావు, సీతాదేవి పురం దిగుబడులను పరిశీలిస్తాం మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని దిగుబడులను పరిశీలిస్తాం. దిగిబడులు తగ్గినట్లయితే ఈ క్రాప్ తో పాటు, ఇన్సూరెన్స్ చేయించుకున్న( లేదా) ఇటీవల క్రాప్ లోను వాడిన రైతులకు బీమా వర్తిస్తుంది.టి. కన్నబాబు, మండల వ్యవసాయ అధికారి వంగర