బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

Jun 11,2024 21:22

ప్రజాశక్తి-విజయనగరంకోట : ఆంధ్రప్రదేశ్‌ను బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు. బుధవారం అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడకు చెందిన క్రాఫ్‌ సంస్థ రూపొందించిన వాల్‌పోస్టర్‌ను నగరంలోని తోటపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు అందరూ పాఠశాలల్లో విద్యను అభ్యసించాలన్నారు. బాలలను ఏ ఒక్కరినైనా పనిలో గానీ, ప్రమాద భరిత రంగాల్లో పెట్టుకుంటే వారిపై కేసులు నమోదు చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బాలల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు రాష్ట్రంలో బాలకార్మికులు లేకుండా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టి, వాటిపై అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది, కార్మిక శాఖ, పోలీసు శాఖ, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రైల్వే శాఖ, మున్సిపల్‌, పంచాయతీ, రెవెన్యూ శాఖ, ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇతర శాఖల భాగస్వామ్యంలో 2025 చివరి నాటికి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ ఇన్‌ఛార్జి అధికారి యాళ్ల నాగరాజు, సిబ్బంది బి.రామకోటి, వి.సంద్య, చైల్డ్‌లైన్‌ సిబ్బంది సిహెచ్‌ అరుణ్‌ కుమార్‌, వి.మీనా, వైసిబి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జి.ఝాన్సీరాణి, ఫాల్గుణ పాల్గొన్నారు.

➡️