ఇంటి దొంగల ముప్పు

May 19,2024 20:58

ప్రజాశక్తి – సాలూరు : ఈసారి ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు రెండింటికీ ఇంటి దొంగల ముప్పు పొంచి ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగుతూ ప్రత్యర్ధి పార్టీకి సహకరించడం, కీలక సమాచారాన్ని చేరవేయడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాయని తెలుస్తోంది. నియోజకవర్గంలో టిడిపి, వైసిపి అభ్యర్థులిద్దరూ ఇంటి దొంగల ముప్పును ఎదుర్కొన్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు రాజకీయాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వారున్న పార్టీ అభ్యర్థి విజయం కోసం చిత్తశుద్ధితో పని చేసేవారు. అయితే గత కొంతకాలంగా ఇంటి దొంగల చేతివాటం ప్రధాన రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా కనిపెట్టలేడన్న చందంగా కొంతమంది నాయకులు కోవర్ట్‌ ఆపరేషన్లను అమలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి సంధ్యారాణి, వైసిపి అభ్యర్థి రాజన్నదొరలిద్దరూ ఇంటి దొంగల బెడదను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా టిడిపికి చెందిన కొంతమంది నాయకులు వైసిపితో కుమ్మక్కై సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి వారు క్విడ్‌ ప్రోకో పద్దతిలో డబ్బులు అందుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ, నాలుగు మండలాలకు చెందిన కొంతమంది నాయకులు కోవర్ట్‌ ఆపరేషన్‌ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే విధంగా వైసిపికి చెందిన కొంతమంది నాయకులు కూడా టిడిపికి లోపాయికారీ సహకారం అందించారనే చర్చ నడుస్తోంది. ఒకటి, రెండు మండలాలు, పట్టణానికి చెందిన నాయకులు టిడిపితో లాలూచీ పడినట్లు అధికారపార్టీ శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయి. పోలింగ్‌ ముగియడంతో ఓట్ల లెక్కింపు కోసం ప్రధాన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఆధిక్యత వస్తుందనే అంచనాల్లో అభ్యర్థులు మునిగి తేలుతున్నారు. ఒకటికి రెండు సార్లు పార్టీ నాయకులు, కార్యకర్తల పనితీరు, ప్రవర్తనలను అంచనా వేసుకుని ఫలితం ఎలా వుండబోతుందని పోస్ట్‌ మార్టం జరుపుకుంటున్న కనిపిస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు, నాయకులు పట్టణంలో సరిగ్గా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయకపోవడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. దీనిపై ఆ పార్టీ అభ్యర్థి కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రత్యర్ధి పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసి లబ్ది పొందాలనే వ్యూహ, ప్రతివ్యూహాలతో టిడిపి, వైసిపి అభ్యర్ధులు ఇద్దరూ ‘ ఆపరేషన్‌ ఆకర్ష్‌’ నిర్వహించారనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఎవరి ఆపరేషన్‌ సక్సెస్‌ అవుతుందో, ఎవరి వ్యూహం ఫలిస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం వారి గత అనుభవాన్ని బట్టి ఆ నష్టం ఏమేరకు వుంటుందనేది అంచనా వేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు, గతంలో అవి అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజల విశ్వసనీయత కొంతవరకు ఓట్లు రాబడితే ఎత్తు కు పైఎత్తులు, వ్యూహ, ప్రతివ్యూహాల వల్ల కొంత మేలు జరుగుతుందని అభ్యర్ధులు భావిస్తున్నారు. దీంతో నియోజకవర్గ ఎన్నికల్లో వైసిపి, టిడిపి అభ్యర్ధులిద్దరూ కోవర్ట్‌ ఆపరేషన్లను ప్రోత్సహించారనేది బహిరంగ రహస్యం. అయితే ఆ ఆపరేషన్లు ఎవరి కొంప ముంచుతాయనేది తేలాలంటే జూన్‌ 4వరకు ఆగాల్సిందే.

➡️