ప్రజాశక్తి – చీపురుపల్లి : ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ( ఐబిఎం ) నిబంధనలు గాలికి వదిలేయడంతో చీపురుపల్లి ప్రాంతంలో పలుచోట్ల మైనింగ్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా తవ్వి వదిలేసిన మైనింగ్ గోతులు మృత్యు కూపాలుగా దర్శనమిస్తున్నాయి. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నిబంధనల ప్రకారం మైనింగ్ ఖనిజాల తవ్వకాలు జరిపి వదిలేసిన గని బంటాలను సంబంధిత యాజమాన్యం బాధ్యత వహిస్తూ వాటికి పూర్తిస్థాయిలో రక్షణ కవచం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను సంబంధిత యాజమాన్యాలు గాలికి వదిలేయడంతో పాటు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు సైతం చూసీ చూడనట్లు వదిలేయడంతో సామాన్యుల ప్రాణాలు గని బంటాలలో ఆవిరైపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేయడంతో పాటు నిబంధనల ప్రకారం ప్రత్యేక కాపలాదారులను కూడా నియమించాల్సి ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. పర్యవేక్షణ లోపంగనుల శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఐబిఎం నిబంధన అమలుపైన నిత్యం పర్యవేక్షణ జరపవలసి ఉన్నప్పటికీ కనీస పర్యవేక్షణ లేకపోవడంతో సంబంధిత యాజమాన్యాలు నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి. నిబంధనల ప్రకారం మైనింగ్ జరిగే ప్రాంతంలో ప్రత్యేక రక్షణ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులతో నెలకొకసారైనా సమావేశాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సమావేశాలు కేవలం రికార్డులకు పరిమితమవుతున్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసి రక్షణ అంశాలపైన తీసుకున్న చర్యలపైన చర్చలు జరపాల్సి ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న వాదన వినిపిస్తుంది. నిబంధనలు మేరకు మైనింగ్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాల్సి ఉన్నా మామ్మూళ్ల మత్తులో పర్యవేక్షణ అటకెక్కిపోయినట్లు తెలిస్తోంద. అనధికారికంగానే..చీపురుపల్లి మండలంలో నడిపల్లి, ఇటికర్లపల్లి, పేరిపి ప్రాంతాలతో పాటు గరివిడి మండలం కోడూరు, గదబవలస ప్రాంతాల్లో అధికారికంగాను, అనధికారికంగా కూడా మైనింగ్ తవ్వ కాలు చేపడుతుఆన్నరు. ప్రభుత్వ అనుమతులను కొద్దిగా తీసుకొని అంతకు మించి ఎక్కువ స్థాయిలో యథేచ్ఛగా మైనింగ్ తవ్వకాలు జరుపుతుండడంతో ఎక్కువ శాతం గని బంటాలు దర్శనమిస్తున్నాయి. సమీప ప్రాంతాల్లో గల గ్రామాల రైతులు పశువుల మేత కొరకు గని బంటాలు గల ప్రాంతాల్లో సంచరిస్తూ పలుచోట్ల మూగజీవాలతో పాటు రైతులు కూడా మృత్యువాత పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గరివిడి మండలం శివరాం గ్రామానికి చెందిన కె.రాములు అనే వృద్ధుడు పేరిపి, ఇటకర్లపల్లి గ్రామాల మధ్య గల సర్వాగి మైనింగ్‌కు చెందిన గుంతలో పడి మృతి చెందడం ఈ ప్రాంత వాసులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. వర్షాలు పడే సమయంలో మైనింగ్ గోతులు అంచులు కొంచెం కొంచెంగా కరిగి జారిపోతుండటంతో ఆ ప్రాంతంలో సంచరించే మూగజీవాలు సైతం గనిబంటాలలో పడి మృతి చెందుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మైనింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసిన గని బంటాల చుట్టూ రక్షణ కవచాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.
