ప్రజాశక్తి-విజయనగరం : నగరంలోని పూల్‌బాగ్ కాలనీలో ఉన్న మూగ, చెవిటి, అంధ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆదివారం ఆ పాఠశాలను సతీసమేతంగా మంత్రి సందర్శించారు. మూగ, చెవిటి, అంధ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి, వారికి తినిపించారు. విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. వారితో సహపంక్తి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం బధిరుల పాఠశాల ఆవరణలో తన పుట్టినరోజు జ్ఞాపకంగా మొక్కను నాటారు. అంధుల పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ చిన్నారుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఒ మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ఎపిసి రామారావు, తదితరులు పాల్గొన్నారు.
