ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం: మంత్రి

Nov 27,2024 20:56

ప్రజాశక్తి – దత్తిరాజేరు:  రైతు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని పోరలి రైతు భరోసా కేంద్రం వద్ద బుధవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం టిడిపి ప్రధాన కార్యదర్శి మిత్తిరెడ్డి ఈశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా వెనకబడ్డ మండలం దత్తిరాజేరేనని అందరూ సహకరిస్తే అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి అవకతవకలూ లేకుండా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గేదెల సింహాద్రి అప్పలనాయుడు, జెడ్‌పిటిసి రౌతు రాజేశ్వరి, వైస్‌ ఎంపిపి మిత్తిరెడ్డి రమేష్‌, మాజీ ఎంపిపి బెజవాడ రాజేశ్వరి, మండల పార్టీ అధ్యక్షులు చప్ప చంద్రశేఖర్‌, మజ్జి మహేష్‌, బోడసింగి సత్తిబాబు, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి ఎస్‌ దుర్గాప్రసాద్‌, టిడిపి, జనసేన, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డెంకాడ: మండలంలోని పెదతాడివాడ రైతు సేవా కేంద్రం వద్ద రైతు ఒమ్మి పైడప్పలనాయుడుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి ఎడిఎ ఎ.నాగభూషణం రైతుకు ట్రక్‌ షీట్‌ అందించారు. ఈ కార్యక్రమంలో ఎఒ పి.నిర్మల, ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

శృంగవరపుకోట: మండలంలోని వెంకటరమణపేట, తిమిడి గ్రామాలలో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో నెలలు తరబడి డబ్బులు ఇచ్చే వారు కాదని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన 48 గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు రైతులు ఖాతాల్లో రూ.500 కోట్లకు డబ్బు జమ చేశామన్నారు. ధాన్యం కొనుగోలుల్లో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని హితువు పలికారు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా అధికారులు త్వరగా దాన్యం కొనుగోలును పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్‌ నాయుడు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ ఇందుకూరి శ్రీనురాజు, ప్రధాన కార్యదర్శి జుత్తాడ రామసత్యం, జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ, నాయకులు కనిశెట్టి ఈశ్వరరావు, సలాది గంగరాజు, శేషు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రేగిడ: మండలంలోని ఆర్‌ ఆముదాలవలస ప్రాథమిక సహకార సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టిడిపి నాయకులు, సొసైటీ మాజీ ఉపాధ్యక్షులు దూబ ధర్మారావు, తహశీల్దార్‌ చిన్నారావు, ఎఒ గిరడ మురళీకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు సేవ కేంద్రం ద్వారా ధాన్యం అమ్మకాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఎండిన, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన గ్రేడ్‌ల వారీగా రైతు ఖాతాల్లోకి చెల్లింపులు చేపడతామన్నారు. వీరితోపాటు రేగిడి సొసైటీ సిఇఒ గోవిందరావు, సిఒ గడే సురేష్‌, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

రామభద్రపురం: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. మండల కేంద్రంలోని పిఎసిఎస్‌లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే బాధ్యతగా తీసుకొని దళారులు లేని మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరణ చేసి 48 గంటల్లో బిల్లులు జమ చేసేందుకు సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. తేమలేని శుభ్రం చేసిన ధాన్యాన్ని తరలించి పూర్తి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు, కరణం విజయభాస్కర్‌, తహశీల్దార్‌ ఆకుల సులోచనారాణి, ఎఒ వి.వెంకటయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️