ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సోమవారం మండలంలోని దారపర్తి పంచాయతీలో గల పల్లపు దుంగడ గిరిజన గ్రామంలో పర్యటించారు. కొంత కాలంగా ధారపర్తి పంచాయతి పరిధిలో గల పలు గ్రామాల్లో తట్టు వ్యాధి ప్రబలిన నేపథ్యంలో సోమవారం ఆయన ఇంటింటికి తిరిగి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పని చేస్తున్న వైద్య సిబ్బందిని ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు గూర్చి ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎప్పుడో కనుమరుగైపోయిన తట్టు వ్యాధి లక్షణాలు మళ్ళి కనిపించటం కొంత ఆందోళనగా ఉందని, సిబ్బంది సరైన టైమ్‌కు ప్రతి చిన్నారికి 9నెలలకి ఒకసారి మరల 16 నెలలకి ఒకసారి ఎంఆర్ టీకా వెయ్యాలని ఇందులో నిర్లక్ష్యం వహించ వద్దని సూచించారు. కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు సమిష్టిగా కృషి చేసి సరైన టైమ్‌కు టీకాలు వెయ్యాలని ఇందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గత కొన్ని రోజులగా ఆసుపత్రిలో ఉన్న రోగులందరూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రస్తుతం అంతా బాగానే ఉందని ఎమ్మెల్సీ తెలిపారు అనంతరం అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్, అంగన్వాడీని తనిఖీ చేశారు. రోడ్డు సరిగా లేనందున గిరిశికర గ్రామానికి ఎమ్మెల్సీ బైక్ పై వెళ్లారు. ఈ కార్యక్రమంలో ధారపర్తి మాజీ సర్పంచ్ ఎర్రయ్య , ఎంపిటిసి దారగిరి, పెదకండేపల్లి సర్పంచ్ యాళ్ళ రమణ, నాయకులు మురళి రాజు, బోజంకి గోవింద్, వబ్బిన సతీష్, ఛామలపల్లి బుజ్జి, అప్పలరాజు, గనివాడ రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
