కొబ్బరి రైతుల సమస్యలపై ఉద్యమం

Oct 10,2024 21:19

ప్రజాశక్తి-పూసపాటిరేగ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొబ్బరి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమమే మార్గమని స్పష్టంచేశారు. గురువారం మండలంలోని గోవిందపురంలో గీతా మందిర్‌ కళ్యాణ మండపంలో ఎపి కొబ్బరి రైతుల సంఘం (ఎపి రైతుసంఘం అనుబంధం) ఆధ్వర్యంలో కొబ్బరి రైతుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎం.ఎరకయ్య దొర అధ్యక్షత వహించారు. కొబ్బరి రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ విజయనగరం ప్రాంతంలో కొబ్బరి బొండం ఎక్కువగా మార్కెటింగ్‌ జరుగుతుందని, రైతుకు రూ.12 నుంచి 15 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. అదే వ్యాపారులు ఒక్కో బొండం రూ.30కు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని చెప్పారు. వ్యాపారుల మోసాలు అరికట్టి కొబ్బరి బొండానికి రైతుకు 25 రూపాయలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కొబ్బరి తెగుళ్ల నివారణకు ఉద్యాన శాఖ ద్వారా సామూహిక నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కొబ్బరి పంట విస్తరణకు సబ్సిడీలు అందించాలని తెలిపారు. పంటల బీమా ప్రతి కొబ్బరి చెట్టుకు అమలు చేయాలని, అందుకు తగిన బీమా పథకం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సదస్సులో కోయర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ కార్యదర్శి మొంగం శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి వి. జగన్నాథం, పైడితల్లమ్మ కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి పి.అప్పడుదొర మాట్లాడుతూ కొబ్బరి రైతులు సమస్యలు పరిష్కారం కోసం సంఘటితం కావాలని కోరారు. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు కొబ్బరి రైతుల సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లాలో 30 వేల ఎకరాలలో కొబ్బరి సాగు అవుతుందని చెప్పారు. ఇటీవల కొబ్బరి పిందెలు రాలిపోతున్నాయని, దిగుబడులు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ అధికారులు వెంటనే స్పందించి శాస్త్రవేత్తల బృందంతో అధ్యయనం చేయించాలని కోరారు. కొబ్బరి రైతులకు డ్రిప్‌ సౌకర్యం 90 శాతం సబ్సిడీతో అందించాలని, నాణ్యమైన కొబ్బరి మొక్కలను రైతులకు అందించాలని డిమాండ్‌ చేశారు. సదస్సులో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.సూర్యనారాయణ, రైతు సంఘం నాయకులు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కొబ్బరి రైతులు సదస్సులో పాల్గొన్నారు.

➡️