ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కన్వీనర్ పి.శంకరరావు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీలో రోడ్లుపై ఏర్పడిన గోతులను పూడ్చేందుకు రూ.50లక్షలు కేటాయించి క్రషర్ బుగ్గి వేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడడం అన్యాయమన్నారు. గోతులను పూడ్చడానికి రూ.50లక్షలు ఖర్చు చేసి పూర్తిగా గోతులను పూడ్చలేదని విమర్శించారు. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గోడ పెయింటింగ్స్‌కు రూ.18లక్షలు, రోడ్డుపై ఉన్న డివైడర్‌పై రంగులు వేసేందుకు రూ.10లక్షలు కేటాయించి నాసిరకం పనులు చేసి అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. సొంత వాహనాలకు డీజిల్ కొట్టించి మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు యూనిఫాం ఇవ్వాలని కోరితే నిధులు లేవని చెపుతున్న అధికారులు నాసిరకం పనులకు జనరల్ ఫండ్ నుంచి బిల్లులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జిల్లా అధికారులు స్పందించి మున్సిపల్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయనతో సిపిఎం మండల కార్యదర్శి ఎస్.గోపాలం, పరశురామ్ ఉన్నారు.గోతుల రోడ్డును పరిశీలించిన నాయకులుపట్టణంలోని పూల్ బాగ్ రోడ్డుపై ఉన్న గోతులను సిపిఎం పట్టణ కన్వీనర్ పి.శంకరరావు, మండల కన్వీనర్ ఎస్.గోపాలం, నాయకులు సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లుపై పెద్దపెద్ద గోతులు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నూతనంగా రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. గోతులను ఇళ్ల నిర్మాణ వ్యర్దాలతో పూడ్చడం సరికాదన్నారు.20 లక్షలు సరిపోతాయి.. బొబ్బిలి మున్సిపాలిటీలో రోడ్డుకు పడిన గోతులను కప్పడానికి రూ.20లక్షలు సరిపోతాయని, రూ.50 లక్షలు ఎలా ఖర్చు చేశారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి మువ్వల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో తారాస్థాయిలో అవినీతి జరుగుతోందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అన్నారు. రూ.50లక్షలతో ఏ స్టాండర్డ్ ప్రకారంగా గోతులు కప్పుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రషర్ బుగ్గితో ఉమ్ముతడి పనిచేసి నాయకులు అధికారులు ప్రజాధనాన్ని పంచుకుంటున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు అన్యాక్రాంతం అవుతుంది తప్ప బొబ్బిలి పట్టణం ఏ కోసానా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు.