కేంబ్రిడ్జ్‌ చదువులు..నారాయణ వసూళ్లు

Sep 29,2024 21:05

నేటి సమాజంలో విద్యతో వ్యాపారం చేస్తున్నారనేందుకు నిదర్శనం పట్టణంలోని కేంబ్రిడ్జ్‌ స్కూల్‌. ప్రభుత్వం దృష్టిలో కేంబ్రిడ్జ్‌ పాఠశాలగానూ ప్రజల దృష్టిలో నారాయణ కార్పోరేట్‌ విద్యాసంస్థగానూ రూపాంతరం చెంది మోసగిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చాలా మంది తమ పిల్లలను కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివించాలన్న ఆశతో నారాయణలో చేర్పించారు. అయితే వీరిలో చాలా మంది నారాయణలో కాకుండా కేంబ్రిడ్జి స్కూల్లోకి తీసుకొచ్చి పాఠాలు చెబుతున్నారు. ఫీజులు వసూళ్లు నారాయణలో చేస్తే పాఠాలు మాత్రం కేంబ్రిడ్జి పాఠశాలలో సాగడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజాశక్తి- శృంగవరపుకోట: మండల కేంద్రంలో ఉన్న కేంబ్రిడ్జ్‌ పాఠశాలను మూడేళ్ల కిందట నారాయణ విద్యాసంస్థల పేరుతో ఒప్పందం చేసుకొని పాఠశాల వ్యవహారాలు అన్నీ నారాయణ విద్యాసంస్థల పేరుతో నడుపుతున్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఇంకా కేంబ్రిడ్జ్‌ పాఠశాలగా చలామణి అవుతుంది. గతంలో కేంబ్రిడ్జి పాఠశాలగా ఉన్న సమయంలో విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు వసూలు చేస్తూ విద్యను అందించేవారు. ఇప్పుడు నారాయణ స్కూల్‌ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏటా ఫీజులు, బుక్స్‌, యూనిఫామ్‌, షూస్‌ ఇలా ప్రతి ఒక్కటీ నారాయణ స్కూల్‌ పేరుమీద విక్రయిస్తూ ఐఐటి కోచింగ్‌, గేమ్స్‌, ఇతర శిక్షణల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ఈ విషయమై పాఠశాల ఎజిఎం శ్రీనివాస్‌ను ప్రజాశక్తి ప్రశ్నించగా ప్రభుత్వం దృష్టిలో ఇది కేంబ్రిడ్జి పాఠశాలని ప్రజల దృష్టిలో నారాయణ కార్పొరేట్‌ విద్యాసంస్థల పాఠశాలగా వ్యవహారాలు నడిపిస్తున్నట్లు ఆయన ఖరాఖండీగా చెబుతున్నారు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఆ స్కూల్‌ పై చర్యలు తీసుకునే స్థాయి నాది కాదు: ఎంఇఒహైస్కూల్స్‌పై అజమాయిసీ డిప్యూటీ డిఇఒకు ఉంటుంది. పట్టణంలో గల ఈ పాఠశాల కేంబ్రిడ్జి స్కూల్‌ పేరు మీదే ఉంది. నారాయణ విద్యాసంస్థలు పేరుతో అధిక ఫీజులు వసూల్‌ చేసిన బుక్స్‌, యూనిఫామ్‌, షూస్‌ వంటివి విక్రయించినా, నారాయణ స్కూల్‌ పేరుమీద బస్సులు నడిపినా, నారాయణ కార్పోరేట్‌ స్కూల్‌ ఫీజుల స్ట్రక్చర్‌ను అమలు జరిపినా చట్టపరమైన చర్యలు ఉంటాయి. కానీ అవి డిప్యూటీ డిఇఒ మాత్రమే చేయగలరు.నర్సింగరావు, ఎంఇఒ, ఎస్‌కోట.మండల న్యాయ సేవా కమిటీ చైర్‌పర్సన్‌ స్పందించాలిగతంలో ఓ ప్రైవేట్‌ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు పై మండల న్యాయ సేవ కమిటీ చైర్‌పర్సన్‌, జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జ్‌ సబ్బవరపు వాణి స్పందించి వసూలు చేసిన అధిక ఫీజును తిరిగి బాధితులకు ఇప్పించారు. పట్టణంలోని నారాయణ స్కూల్‌ యాజమాన్యం చేస్తున్న ఆగడాలను మండల న్యాయ సేవ కమిటీ చైర్‌పర్సన్‌ స్పందించి చర్యలు తీసుకోవాలి.మద్దిల రమణ సిపిఎం మండల కార్యదర్శి, ఎస్‌కోట

➡️