30 రేషన్‌ షాపు డీలర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

Dec 11,2024 21:05

ప్రజాశక్తి- బొబ్బిలి: బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 30 రేషన్‌ షాపు డీలర్ల భర్తీకి ఆర్‌డిఒ రామ్మోహనరావు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన 23 రేషన్‌ షాపులకు, నూతనంగా ఏర్పాటు చేసిన 7 రేషన్‌ షాపులకు డీలర్లను నియమిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బొబ్బిలి మండలంలో 8, బాడంగిలో 4, తెర్లాంలో 5, దత్తిరాజేరులో ఒకటి, గజపతినగరంలో 9, మెంటాడలో 3 షాపులకు డీలర్లను నియమిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించిన వారు లేకపోతే ఫెయిల్‌ అయిన వారిని అర్హులుగా గుర్తించి మార్కులు మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. 18 ఏళ్లు నిండి 40 ఏళ్ల లోవు వయస్సు ఉండి స్థానికులై ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వికలాంగులు ఆయా మండలంలో నివసించిన వారై ఉండాలని చెప్పారు. సరుకులు విడిపించే ఆర్థిక స్తోమత ఉండి, కుటుంబ సభ్యులలో ఎవరికి కిరాణా వ్యాపారం ఉండకూడ దన్నారు. రాజకీయ పదవులు ఉన్న అభ్యర్థులు, కేసులు ఉన్నవారు అర్హులు కాదన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 11 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 19న దరఖాస్తులు పరిశీలించి 20న అర్హులు జాబితా ప్రకటించి, 26న రాత పరీక్ష, 28న ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. 30న డీలర్లను ప్రకటిస్తామని చెప్పారు. 80 మార్కులకు రాత పరీక్ష, 20మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

➡️