ప్రతిపాదలతోనే సరి

Feb 5,2025 21:09

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని కేజీపూడి సచివాలయం పరిధిలో గల బంగారయ్య పేట, చిట్టివానిపాలెం గిరిజన గ్రామాల మధ్యలో ప్రాథమిక పాఠశాలను గతంలో ఏర్పాటు చేశారు. కొండను ఆనుకుని నిర్మించిన ఈ పాఠశాలలో 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఈ రెండు గ్రామాల నుంచి బడికి వెళ్లే పిల్లలు రహదారి లేక పొలం గట్ల పైన, డొంకాలు మధ్య సుమారు అర కిలోమీటరు నడిచి వెళ్ళాలి. వర్షాకాలంలో పిల్లలు పలుమార్లు గట్లు పై జారీ బురదలో పుస్తకాలు పడి ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. ఏదో విధంగా పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని ఆశతో తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపిస్తున్నారు. అటువంటి ఈ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వర్షం వస్తే స్లాబు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. గోడలు కూడా బీటల వారి ఉన్నాయి. స్లాబ్‌ పెచ్చులు కూడా ఊడిపోయి ఉన్నాయి. కిటికీలకు రెక్కలు లేవు, రికార్డులు భద్రపరచుకోవడానికి కూడా అవకాశం లేదు. పిల్లలకు వంటగది కూడా సరిగా లేకపోవడంతో ఇంటి వద్ద వంట మనిషి వంట చేసి పిల్లలకు తేవాల్సి వస్తుంది, తాగడానికి నీటి సౌకర్యం కూడా లేదు. తాగునీటి బోరు పాడైపోవడంతో చిట్టివానిపాలెం నుంచి జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా తాగునీటి సౌకర్యం నిమిత్తం పాయింట్‌ ఏర్పాటు చేశారు కానీ నీరు రావడం లేదు. భోజనం పెట్టే సమయానికి పిల్లలకు చిట్టివానిపాలెం గ్రామం వెళ్లి బకెట్లతో తాగునీరు తెచ్చుకోవాలసిన పరిస్థితి ఏర్పడింది. టాయిలెట్స్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. పలుమార్లు ప్రజాశక్తి దినపత్రికలో కథనం వెలవడటంతో భవన నిర్మాణంతో పాటు సౌకర్యాలు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు సరే కానీ నిధులు మాత్రం మంజూరు కావడం లేదు. గిరిజనుల మీద చిన్నచూపు లేకుండా అధికారులు స్పందించి భవన నిర్మాణంతో పాటు సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని గిరజనులు కోరుతున్నారు.ఎప్పుడు కూలిపోతుందో..పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనతో విద్యను కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వ అశ్రద్ధ వల్ల నిధులు మంజూరు కాకపోయినప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టి గిరిజన గ్రామాల పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించాలని రెండు గ్రామాల పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️