ప్రజాశక్తి- శృంగవరపు కోట : పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని తిమిడి గ్రామ పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య పనులు చేస్తున్న పల్లకిల సూరిబాబుకి 2023, 2024 సంవత్సరానికి సంబంధించి 18 నెలలు జీతం తిమిడి గ్రామపంచాయతీ చెల్లించవలసి ఉండగా చెల్లించుకున్న ఆ కార్మికుడితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు. తిమిడి గ్రామ పంచాయతీ ఎస్.కోట గ్రామపంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లకు 12 నెలలు ఎస్‌కోట మేజర్ పంచాయతీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు 4 నెలలు జీతాలు బకాయిలు ఉన్నా పంచాయతీ అధికారులు సంక్రాంతి పండుగతో పస్తులుండి పనిచేయమంటారా అని ప్రశ్నించారు. ఇప్పటికే జిల్లా అధికారులు జిల్లాలో ఉన్న అన్ని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నుంచి బకాయి జీతాలు చెల్లించాలని సర్య్కూలర్ పంపించారన్నారు. పండగ లోపు బకాయి ఉన్న జీతాలు చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య పనులు పూర్తిగా నిలిపివేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు, పారిశుధ్య కార్మికులు పల్లకిలో సూరిబాబు, అక్కివరపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/skt-cpm-1.jpg)