ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలకి డిసెంబర్ నెల జీతాలు ఇచ్చినా, జిల్లాలో మాత్రం నేటికీ వేయలేదని, సంక్రాంతి పండగ నేపథ్యంలో వెంటనే జీతాలు చెల్లించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్ కలెక్టర్‌ను కోరారు. ఈమేరకు గురువారం కలెక్టర్ అంబేద్కర్‌ను కలిసి వినతి అందజేశారు. జిల్లాలో పీడీ సెలవులో ఉన్నారనే కారణంతో అంగన్వాడీలకు డిసెంబర్ నెల జీతాలు వేయలేదని తెలిపారు. సంక్రాంతి పండగ పూట జీతాలు పడకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే అంగన్వాడీలకు జీతాలు వేసేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ వెంటనే జీతాలు వచ్చేటట్లు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.