‘పెంగాల్‌’ గుబులు

Nov 29,2024 21:42

ప్రజాశక్తి-బొబ్బిలి, వంగర : ఓవైపు కోసిన వరిచేనంతా పంట పొలాల్లోనే ఉంది. నూర్పిడి చేసిన ధాన్యం కళ్లాల్లోనే ఉన్నాయి. మరోవైపు భారీ వర్షాలంటూ వాతావరణ శాఖ, జిల్లా అధికారుల హెచ్చరికలు… అందుకనుగుణంగానే శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన చిరుజల్లులతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఏడాది కష్టమంతా వర్షార్పణమైపోతుందన్న భయంతో పంటను కాపాడుకునేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కోసేసిన వరి పంటను కాపాడుకునేందుకు పొలం, కళ్లాల్లో కుప్పలు వేస్తున్నారు. కళ్లాల్లోని ధాన్యం బస్తాలపై టార్పాలిన్లు కప్పుతున్నారు. పెంగాల్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి. అందుకనుగుణంగానే బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం, దత్తిరాజేరు, వంగర, డెంకాడ, తదితర మండలాల్లోనే శుక్రవారం సాయంత్రం నుంచే చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. పంట పొలాల్లో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఖరీఫ్‌ వరి పంట పూర్తి స్థాయిలో కోత దశకు రావడంతో జిల్లాలో బొబ్బిలి, రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాల పరిధిలో పలు గ్రామాల్లో ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. కోసి ఉంచిన పంట సగానికి పైగా పొలాల్లోనే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసేసిన వరిచేను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. తుపాను భయంతో కొంతమంది రైతులు కోసేసిన వరి పంటను కళ్లాలకు తరలించి కుప్పలు వేశారు. అవకాశం లేక మరి కొంతమంది రైతులు పంట పొలాల్లోనే కుప్పలు వేసి పంటను కాపాడుకుంటున్నారు. వంగర మండలంలోని రుషింగి, రాజులగుమ్మడ, వివిఆర్‌ పేట, కింజంగి, మరువాడ, ఇరువాడ తదితర గ్రామాల్లో రైతులు వరి పంటను కోత కోసి, పొలాల్లో ఓవులుగా వేశారు. పెంగాల్‌ తుపాను ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి తేలికపాటి వర్షం కురుస్తుండటంతో పొలాల్లో కుప్పలు వేసిన పంట తడిసిపోతే నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీవర్షాలు కురిస్తే కోత దశలో ఉన్న మిగతా వరిచేను పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న రైతులను కలవరపెడుతోంది. కోయకుండా ఉన్న పంట నేలకొరిగితే పంటకు నష్టం అధికంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటకు నష్టం వాటిల్లితే చేసిన అప్పులు ఎలా తీరుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.కళ్లాల్లోనే ధాన్యం జిల్లాలో ఇప్పటికే కోతలు పూర్తయిన చోట రైతులు నూర్పిడి చేశారు. నూర్పిడి పూర్తి చేసిన ధాన్యాన్ని కళ్లాల్లో నిల్వ చేశారు. కానీ వర్షాలకు ధాన్యం తడిసిపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఇప్పుడిప్పుడు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కళ్లాల్లో ధాన్యం ఉన్న రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రైతులకు సూచనలుతుపాను నేపథ్యంలో వరికోతలు వాయిదా వేయాలని, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ తెలిపారు. శుక్రవారం మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి మండలాల్లో పర్యటించిన ఆయన.. వ్యవసాయాధికారులకు సూచనలు చేశారు. రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

➡️