ఇంకా అందని పింఛన్లు

May 16,2024 20:16

ప్రజాశక్తి- చీపురుపల్లి : ఇంటి వద్దకే పింఛన్‌ డబ్బులు పంపిణీ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం మాత్రం కావాలనే రకరకాల సాకులు చెప్పి జాప్యం చేసి వృద్ధులను, వికలాంగులను, వితంతువులను రోడ్ల మీదకు రప్పించి నానా తిప్పలు పెట్టిందనడంలో సందేహం లేదు. మే నెలకు సంబందించి ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్లు సొమ్మును లబ్ధి దారులకు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ చేయడంతో ఆ డబ్బులు తీసుకొనేందుకు బ్యాంకుల చుట్టూ గత 15 రోజులుగా తిరుగుతున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ఉన్నందున వాలంటీర్ల సేవలను నిలిపివేయడంతో ఇంటింటికి పంపిణీ చేయాల్సిన పింఛన్ల డబ్బు లబ్దిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. అయితే డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన పింఛనుదారులకు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. మీవి జీరో అకౌంట్‌లు కావడంతో ఎప్పుడో కాలం చెల్లిపోయాయని తిరిగి కొత్త ఖాతాలు తెరుచుకోవాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో పింఛనర్లు అవాక్కయ్యారు. దీంతో చేసేది లేక తమకు రావలసిన డబ్బులు కోసం ప్రతీ రోజు ఉదయాన్నే బ్యాంకుల వద్ద క్యూ కడుతూ తమకు కొత్త ఖాతాలు తెరిచి తమ పింఛను డబ్బులు తమకు ఇవ్వాలని అధికారులను అడుగుతున్నారు. అయినప్పటికీ సంబంధిత బ్యాంకు అధికారులు కొత్త ఖాతాలు ఓపెన్‌ చేయడానికి కనీసం 15 రోజులు పడుతుందని చెప్పడంతో వృద్దులు ఎండలోనే ఉండి ఇబ్బందులు పడుతున్నారు. తమ డబ్బులు వస్తే మందుల కోసం, తమ సొంత అవసరాలు కోసం ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఈ వృద్దాప్యంలో తమని ఇలా ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదంటూ ప్రభుత్వ పెద్దలను, ఇటు అధికారులను, బ్యాంకు సిబ్బందిని అడుగుతూ వాపోతున్నారు. జన్‌ధన్‌ ఖాతాలే కొంప ముంచాయా?దేశంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దేశంలో ఉన్న ప్రతి ఒక్కరినీ లక్షాధికారిని చేస్తామని చెప్పి జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయించింది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి పథకం డబ్బులు కూడా జన్‌ధన్‌ ఖాతాలోనే జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు అప్పటిలో పెద్ద ఎత్తున పలు బ్యాంకుల్లో జీరో అకౌంట్లు ఓపెన్‌ చేశారు. అయితే ప్రభుత్వం ఏడాది ఒకసారైనా వారి ఖాతాల్లో ఎటువంటి డబ్బులూ జమ చేయకపోవడంతో ఆయా ఖాతాలు కాలం చెల్లిపోయాయి. ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మే నెలకు సంబంధించి పింఛనుదారుల డబ్బులను ఆ అకౌంట్లలో జమ చేయడంతో సంబంధిత బ్యాంకులు అడ్డు చెప్పాయి. ఖాతాలలో డబ్బులు పడ్డాయి గాని సంబంధిత ఖాతాలన్నీ కాలం చెల్లిపోయాయని బ్యాంకు అధికారులు చెప్పడంతో పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి ప్రభుత్వం జమ చేసిన డబ్బులు కోసం తిరగరాని చోటల్లా తిరుగుతూ తమకు కొత్త ఖాతాలో ఓపెన్‌ చేసి తమ డబ్బులు ఇవ్వాలని వాపోతున్నారు.మండలంలో 8824 మంది పింఛనుదారులుమండలంలో వివిధ కేటగిరీలకు సంబంధించి 8,824 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్లు 4,446, వితంతువులు 2034, వీవర్స్‌ 57, వికలాంగులు 1283, తొడ్డి టప్పర్స్‌ 53, అభయ హస్తం 502, మత్స్యకార 5, ఒంటరి మహిళలు 162, డప్పు కళాకారులు 143, ట్రెడిషినల్‌ కొబ్బలెర్స్‌ 90, సికెడియు 5, మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ 23, కళాకారులు 21 మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి సంబంధించిన పింఛన్లు బ్యాంకు ఖాతాలలోని జమ కావడంతో వారందరూ 15 రోజుల గడుస్తున్నప్పటికీ ఫించన్లకు నోచుకోలేదు. తమ డబ్బులు తమకు ఇప్పించి పుణ్యం కట్టుకోవాలని ప్రభుత్వ పెద్దలను, అధికారులను, బ్యాంకు అధికారులను కోరుతున్నారు.

➡️