195 కంపెనీల ఏర్పాటుకు అనుమతులు

Feb 5,2025 21:36

ప్రజాశక్తి-విజయనగరంకోట : గత ఆరు నెలల కాలంలో సింగిల్‌ విండో విధానంలో 221 పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు అందగా, 195 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. సింగిల్‌ విండో విధానంలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పరిశ్రమలకు త్వరగా అనుమతులు మంజూరు చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఇకపై ప్రతి నెలా 5వ తేదీన పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి త్వరగా అనుమతులు వచ్చేలా చూస్తామన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి వద్ద అధికంగా పెండింగ్‌ ఉన్నందున త్వరగా పరిష్కరించాలని ఇఇని ఆదేశించారు. పిఎం విశ్వకర్మ పథకం కింద 65,908 దరఖాస్తుల్లో 5852 యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై కలెక్టర్‌ ఆరా తీశారు. వివిధ స్థాయిల్లో 41,514 దరఖాస్తులు ఎవరి వద్ద ఎందుకు పెండింగ్‌ ఉన్నదీ తనకు నివేదించాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. యూనిట్లు మంజూరైన వారికి ఎలాంటి శిక్షణ అందిస్తున్నదీ తెలుసుకున్నారు.చిన్న పరిశ్రమలపై జరుగుతున్న సర్వేపై కలెక్టర్‌ సమీక్షించారు. ఎంఎస్‌ఎంఇ సర్వే వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఇందులో సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు పొందిన సంస్థలు.. ఆ గడువు తీరిపోవడంతో కొంత అదనపు సమయం ఇవ్వాలని అభ్యర్థించాయి. దీంతో ఏడు పరిశ్రమలకు ఏడాది వరకు సమయం ఇస్తూ ప్రోత్సాహక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే అందించి, ఆ యూనిట్లు ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఐదు పరిశ్రమలు తాము ఒప్పందంలో పేర్కొన్న ఉత్పత్తులకు బదులుగా వేరొక ఉత్పత్తుల తయారీకి దరఖాస్తు చేసుకోగా, ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ సమావేశంలో నిర్ణయించారు.ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న పలువురు జిల్లా స్థాయి అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. సమావేశానికి హాజరుకాలేని అధికారులు ఇకపై ముందస్తు అనుమతి పొందాలని స్పష్టంచేశారు.సమావేశంలో జిల్లా పరిశ్రమల ఇన్‌ఛార్జి అధికారి మదుసూధన్‌ రెడ్డి, ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ మురళీమోహనరావు, కాలుష్య నియంత్రణమండలి ఇఇ సరిత, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణచక్రవర్తి, ఉద్యానశాఖ డిడి జమదగ్ని, డిప్యూటీ కలెక్టర్‌ జోసెఫ్‌, మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి, చేనేత జౌళి ఎడి మురళీకృష్ణ, మార్కెటింగ్‌ ఎడి బి.రవికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నల్లనయ్య, భూగర్భ జలశాఖ డిడి దుర్గాప్రసాద్‌, బిసి కార్పొరేషన్‌ ఇడి పెంటోజీ, జిల్లా రిజిస్ట్రార్‌, మెప్మా పీడీ తదితరులు పాల్గొన్నారు.

➡️