ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

May 13,2024 22:42

విజయనగరం కోట/టౌన్‌ : జిల్లాలో ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్కడక్కడా ఇవిఎంల్లో స్వల్ప అవాంతరాలు తలెత్తగా, వెంటనే అధికారులు స్పందించి సరిచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1847 పోలింగ్‌ కేంద్రాల్లో తొలుత పోలింగ్‌ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ, ఆ తరువాత పుంజుకుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రాలవద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఉదయం 5.30 గంటలకే చాలా పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన టెంట్లు సరిపోక ఎండలోనే ఓటర్లు వేచి ఉండాల్సి వచ్చింది. వృద్దులు, విభిన్న ప్రతిభావంతుల కోసం వీల్‌ ఛైర్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు ప్రకటించినా చాలా చోట్ల వీల్‌ చైర్లు లేక వికలాంగులు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. జిల్లాలోని మొత్తం 11 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో మరిన్ని అదనపు హంగులు ఏర్పాటు చేశారు.కంట్రోల్‌ రూమ్‌ నుంచి కలెక్టర్‌ నాగలక్ష్మి పర్యవేక్షణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్‌ రూము నుంచి పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. ఉదయం 4.30 గంటల నుంచే వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా, ఆర్‌ఒల ద్వారా పోలింగ్‌ బూత్‌ల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఇవిఎంల్లో సమస్యలు తలెత్తిన చోట, వెంటనే సంబంధిత అధికారులను హెచ్చరించి, వాటిని సరిచేసి, పోలింగ్‌ కొనసాగే విధంగా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై మరింత దృష్టి సారించారు. విస్తతంగా పర్యటించిన ఎన్నికల పరిశీలకులు ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా సోమవారం జిల్లా వ్యాప్తంగా విస్తతంగా పర్యటించారు. పోలింగ్‌ తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. మైక్రో అబ్జర్వర్ల ద్వారా పోలింగ్‌ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పోలీసు పరిశీలకులు సచింద్ర పటేల్‌, జిల్లా వ్యయ పరిశీలకులు ప్రభాకర్‌ ప్రకాష్‌ రంజన్‌, ఆనంద్‌ కుమార్‌, ఆకాష్‌ దీప్‌ కూడా జిల్లాలో పర్యటించి, పోలింగ్‌ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు జిల్లాలో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి స్థానిక కణపాకవద్దనున్న పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ కూడా ఇదే పోలింగ్‌ కేంద్రంలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎస్‌పి ఎం.దీపిక తోటపాలెంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటువేశారు. విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి కుటుంబ సమేతంగా, ఎంఆర్‌ కళాశాలలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కంటోన్మెంటు సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. జెడ్‌పి ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఓటు వేశారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి జొన్నగుడ్డి పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ కుటుంబ సమేతంగా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

➡️