ఆక్రమణలో చెరువులు

Jun 10,2024 19:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పర్యావరణం, భూగర్భ జలాల పరిరక్షణతోపాటు ప్రజల దాహార్తి తీర్చేలా దూరదృష్టితో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువులు ఆక్రమణలతో కుంచించుకు పోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడి రూ.కోట్ల విలువ చేసే నగర పాలక సంస్థ చెరువుల భూములు నేడు పెద్ద వ్యాపారంగా మారాయి. ఏడాదికేడాదికి కనుమరుగవుతున్నాయి. దీంతో నగరంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే నగరంలోని చెరువులన్నీ కొన్నేళ్లలో మాయమయ్యే ప్రమాదం పొంచి ఉందినగరంలో, చుట్టుపక్కలా చిన్నా పెద్దా కలిపి సుమారుగా 80 వరకు చెరువులు ఉన్నాయి. వాటిని రక్షించడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారంలో ఉన్న వారే చెరువులు కబ్జా చేస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి సొమ్ముచేసుకుంటుంటే, అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. అంతే తప్ప వాటిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. నగరంలో పెద్ద చెరువు ఏడాదికి ఏడాది ఆక్రమణలు పెరిగి కుచించుకు పోతుంది. వందల ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు రోజురోజుకు తగ్గిపోతోంది. నగరానికి నీటి పథకం ద్వారా తాగునీటిని అందించేందుకు ఇదే చెరువు వద్ద నీటి శుద్ధి కర్మాగారం పనులు కూడా జరుగుతున్నాయి. నగరం నడిఒడ్డున మంచి ఆహ్లాదాన్ని అందించే చెరువు నేడు కబ్జాకు గురి అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పడమర వైపు గట్లు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడ కొత్తగా కొన్ని నిర్మాణాలు కూడా వెలిశాయి. చెరువు గట్టుపై ఇళ్లు ఉన్నవారికి ప్రభుత్వ స్థలం ఇచ్చిందో, లేదో సర్వే చేయాలని, లేనిపక్షంలో వారికి ఇళ్లు మంజూరు చేసి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడంతోపాటు చుట్టూ నడక దారి ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయంతోపాటు ప్రజల ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చేపట్టిన పనులు కూడా నేటికీ పూర్తి కాలేదు.
నగరంలోని దాసన్నపేట ఎర్ర చెరువు, కాటవీధి నల్లచెరువు, బాబామెట్ట కొండగెడ్డ, అయ్యకోనేరు, బుచ్చన్న కోనేరు ఆక్రమణలతో కుచించుకు పోతున్నాయి.- గెడ్డవీధి, రాజీవ్‌నగర్‌ మీదుగా ధర్మపురి వరకు వెళ్లే గెడ్డ.. పిల్ల కాలువగా మారింది. – ధర్మపురి చెరువు, ప్రదీప్‌నగర్‌ చెరువులు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాయి.- ప్రేమసమాజం ఎదురుగా ఉన్న చెరువు పూర్తిగా మూత పడింది. – ఊటగెడ్డ వాగు కబ్జాలు చేసి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో ఊరిగా మారిపోయింది.- సారిపల్లి రోడ్డులో క్వారీకొండ వాగులు కబ్జా కోరల్లో చిక్కిశల్యమైపోయాయి.
ఏటా నగరంలో వేసవి ప్రారంభం కాక ముందే తాగునీటి సమస్య అధికంగా ఉంటోంది. చెరువులన్నీ ఆక్రమణలకు గురి కావడం వల్ల త్వరలో తాగునీటి విలయాన్ని మనం చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వ్యాపార కేంద్రాలుగా చెరువులునగరంలో ఉన్న చెరువులు చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వ్యాపారానికి అనువుగా మారి పోయాయి. నగరానికి ఆనుకొని ఉన్న ధర్మపురి, కెఎల్‌పురం, కణపాక, కామాక్షినగర్‌, అయ్యన్నపేట, జమ్ము నారాయణపురం, అయ్యప్పనగర్‌, బాబా మెట్ట ప్రాంతం, గాజులరేగ వంటి ప్రాంతాల్లో నేడు చెరువులు కనిపించడం లేదు. ఆ ప్రాంతాల్లో ఉన్న చెరువుల చుట్టూ నిర్మాణాలు జరిగి వాటి పరిమాణం రోజురోజుకు తగ్గిపోతోంది. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేయకూడదని తెలిసినా అడ్డగోలుగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఇలా నగరంలో, చుట్టూ ఉన్న చెరువులు కబ్జాకు గురై వ్యాపార స్థలాలుగా మారిపోయాయి. ఇప్పటికైనా స్పందించేనా?చెరువులు కబ్జాపై అధికారులు స్పందించి వాటిని రక్షించకకోతే చెరువులు ఉండేవట.. అని చెప్పుకునే పరిస్థితి దాపురించే ఆవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా చెరువు గట్టు ప్రాంతాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేయకూడదని నీతులు చెప్పే పాలకులకు, అధికార్లకు చెరువుల కబ్జాలు కనిపించడం లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వెంటనే కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలకులు, అధికారులు చిత్త శుద్ధితో చెరువులను కబ్జాల నుంచి కాపాడకపోతే భవిష్యత్తు తరాలకు నీటి సమస్యతోపాటు కలుషిత వాతావరణం అందించే వాళ్లవుతారు.

➡️