ఆక్రమణలో నగరంలో చెరువులు 

Jun 10,2024 15:45 #Vizianagaram

తగ్గిపోతున్న భూ గర్భ జలాలు
అధికారులు స్పందించకుంటే చెరువులు మాయం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పర్యావరణం, భూగర్భ జలాల పరిరక్షణతోపాటు ప్రజల దాహార్తి తీర్చేలా దూరదృష్టితో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువులు ఆక్రమణలతో కుంచించుకుపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడి రూ.కోట్ల విలువ చేసే పురపాలక సంస్థ చెరువుల భూములు నేడు పెద్ద వ్యాపారంగా మారాయి. నగరంలో చిన్నా పెద్దా కలిపి సుమారుగా 80 వరకు నగరంలో, నగరం చుట్టూ ఉన్నాయి. వాటిని రక్షించడంలో, కాపాడటంలో పాలకులు,అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారంలో ఉన్న వారే చెరువులు కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్ముకుంటుంటే అధికారులు కళ్ళ అప్పగించి చూస్తున్నారు తప్ప వాటిని కాపాడే ప్రయత్నం చేయడంలేదు. నగరంలో అతిపెద్ద చెరువు పెద్ద చెరువు నేడు ఏడాదికి ఏడాది ఆక్రమణలు పెరిగి కూచించుకుపోతుంది. వందల ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు రోజు రోజుకి తగ్గిపోతుంది. పట్టణానికి నీటి పథకం ద్వారా తాగునీటిని అందించేందుకు ఇదే చెరువు వద్ద నీటి శుద్ధి కర్మాగారం పనులు కూడా జరుగుతున్నాయి. నగరం నడి బిడ్డున మంచి ఆహ్లాదాన్ని అందించే చెరువు నేడు కబ్జాకు గురి అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పడమర వైపు గట్లు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడ కొత్తగా కొన్ని నిర్మాణాలు కూడా వెలిశాయి.చెరువు గట్టుపై ఇళ్లు ఉన్నవారికి ప్రభుత్వ స్థలం ఇచ్చిందో లేదో సర్వే చేయాలని, లేనిపక్షంలో వారికి ఇళ్లు మంజూరు చేసి ఆక్రమణలు తొలగించాలని కోరుతున్న పట్టించుకునే వారు లేరు. చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడం, చుట్టూ నడక దారి ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయంతోపాటు ప్రజల ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చేపట్టిన పనులు కూడా నేటికీ పూర్తి కాలేదు. వీటితోపాటు నగరంలో ఉన్న దాసన్న పేట ఎర్ర చెరువు, కాటవీధి నల్లచెరువు, బాబామెట్ట కొండ గెడ్డ, అయ్య కోనేరు, బుచ్చన్న కోనేరు ఆక్రమణలతో కుచించికపోతున్నాయి.
గెడ్డ వీధి రాజీవ్ నగర్, మీదుగా ధర్మపురి వరకు గెడ్డ వాగు పిల్ల కాలువుగా మారింది. ధర్మపురి చెరువు, ప్రదీప్ నగర్ చెరువులు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. ప్రేమ సమాజం ఎదురు చెరువు పూర్తిగా మూత పడిందీ. ఊట గెడ్డ వాగులు కబ్జా చేసి నిర్మాణంతో ఊరిగా మారిపోయింది.
సారిపల్లి రోడ్డులో క్వారీ కొండ వాగులు కబ్జాగాళ్ళ కోరల్లో చిక్కి శల్యమైపోయాయి.
ఇప్పటికే నగరంలో వేసవి ప్రారంభం కాక ముందే తాగునీటి సమస్య అధికంగా ఉంది.చెరువులన్నీ ఆక్రమణలకు గురి కావడం వలన త్వరలో తాగునీటి విలయాన్ని మనం చూసే పరిస్టిట్లు కనిపిస్తున్నాయి.

వ్యాపార స్థలాలుగా మారిన చెరువులు..
నగరంలో ఉన్న చెరువు లు చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వ్యాపారానికి అనువుగా మారి పోయాయి. నగరానికి ఆనుకొని ఉన్న ధర్మపురి,కే ఎల్ పురం,కనపాక, కామక్షినగర్, అయ్యన్నపేట,జమ్మూ నారాయణపురం, అయ్యప్ప నగర్,బాబా మెట్ట ప్రాంతం, గాజులురేగ వంటి ప్రాంతాల్లో నేడు చెరువులు కనిపించడం లేదు. ఆ ప్రాంతాల్లో ఉన్న చెరువులు చుట్టూ నిర్మాణాలు జరిగి వాటి పరిమాణం రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. చెరువు ను కబ్జా చేసి నిర్మాణాలు చేయకూడదని తెలిసినా అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇలా నగరంలో, నగరం చుట్టూ ఉన్న చెరువుకు కబ్జాకు గురి అయ్యి వ్యాపార స్థలాలుగా మారిపోయాయి.

అధికారులు, నేటి పాలకులు స్పందించకుంటే భవిష్యత్ తరాలకు అన్యాయం..
చెరువులు కబ్జా పై అధికారులు స్పందించి వాటిని రక్షించకకోతే చెరువులు ఉండేవట అని చెప్పుకునే పరిస్తితి ధాపురించే ఆవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా చెరువు గట్టు ప్రాంతాలు,చెరువులు కబ్జాకు గురి అయ్యాయి. చెరువు గర్భాల్లో,చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేయకూడదని నీతి కబుర్లు చెప్పే పాలకులుకు, అధికార్లకు చెరువులు కబ్జాలు కన్పించడం లేదా అనే ప్రశ్నకు ఉత్పన్నం అవుతున్నాయి.వెంటనే నేటి అధికారంలోకి వచ్చిన పాలకులు,అధికారులు చిత్త శుద్ధితో చెరువులు కబ్జా ల నుంచి కాపడకపోతే భవిష్యత్ తరాలకు నీటి సమస్యతో పాటు,కలుషిత వాతావరణం అందించే వాళ్ళు అవుతారు.

➡️