ప్రజాశక్తి – వంగర: అల్పపీడన ప్రభావం కారణంగా వరికోతలను రైతులు వాయిదా వేసుకోవాలని ఎఒ టి.కన్నబాబు రైతులకు సూచించారు. మండలంలోని తలగాం, ఎం సీతారాంపురం, కొట్టిశ, కొప్పరవలస తదితర గ్రామాలలో ఆయన బుధవారం పర్యటించి రైతులకు అవగాహన కల్పించారు. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వరికోతలు వాయిదా వేసుకో వడం మంచిదన్నారు. ఇప్పటికే వరి కోతలు కోసిన వారు మాత్రం కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. దళారులను నమ్మి మోసవద్దని, రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యం విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. బాడంగి: రానున్న తుపాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎఒ శిరీష అన్నారు. మండలంలోని కోడూరు వరి పొలాలను ఆమె బుధవారం పరిశీలించారు. 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వర్షసూచన ఉండటం వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోతలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ కోత కోసినట్లయితే, కుప్పలు వేసుకోవాలని, నూర్పు చేసిన ధాన్యం దగ్గర ఉన్న మిల్లుకు తరలించి కాపాడుకోవాలని చెప్పారు.డెంకాడ: వర్ష ప్రభావం కారణంగా రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని, నూర్పిడి చేసిన ధాన్యంను వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి విక్రయించుకోవాలని ఎఒ నిర్మల సూచించారు. కోసిన వరును పొలంలో ఉంచకుండా చిన్నచిన్న దెబ్బలుగా పెట్టుకోవాలన్నారు. వరి యంత్రాల ద్వారా వరి పంటను కోసుకొని పంటను ఇంటికి తరలించుకోవాలన్నారు ప్రస్తుతం కోతలు ఉంటే వాయిదా వేసుకోవాలన్నారు.