సాగుకు సన్నద్ధం

Jun 10,2024 21:10

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : రుతుపవనాల తాకిడితో అన్నదాతలో కలివిడి కనిపిస్తోంది. ఖరీఫ్‌ పంటల సాగుకు సన్నద్ధమౌతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నేల కాస్త చల్లబడింది. దీంతో ప్రస్తుతం అక్కడక్కడా వేరుశనగ విత్తనాలు నాటుతున్నారు. మరోవైపు వరి నారుపోతకు అనుగుణంగా దుక్కులు వేసి మడులను తయారు చేస్తున్నారు. మరొకటీ లేదా రెండు జల్లులు కురిస్తే నారుమడులు సిద్ధం చేసుకోవడానికి అన్ని ప్రాంతాల్లోనూ అనువుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. సకాలంలోనే జల్లులు కురుస్తున్నప్పటికీ ఇంకా సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడం రైతులను కొంచె ఇబ్బంది పరుస్తోంది. విజయనగరం పూర్తిగా వ్యవసాయాధారిత జిల్లా. పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడంతో పూర్తిగా వర్షాధారంగానే ఖరీఫ్‌ పంటలు సాగవుతాయి. ఈ పంటలతోనే ఏడాదంతా బతుకీడ్చాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌ కోసం రైతాంగం ఏడాదంతా ఎదురు చూస్తుంటుంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటలూ కలుపుకుని 499,455 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా, ఇందులో అత్యధికంగా వరి 2,31,850 ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. మొత్తంగా ఇప్పటివరకు 1105 (0.4 శాతం) మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ, చెరకు తదితర పంటల సాగైనది. గత ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 3,13,465 ఎకరాలు కాగా, 2,84,915 (91 శాతం) విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. జిల్లాకు 50,267 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించగా, ఇప్పటి వరకు 27,235 క్వింటాళ్లు రైతు భరోసా కేంద్రాలకు చేరినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం విత్తన కేటాయింపులో అత్యధికంగా వరి 46,530 క్వింటాళ్లు, పచ్చిరొట్ట విత్తనాలు 2,517 క్వింటాళ్లు, ఇతర పంటల విత్తనాలు 1220 క్వింటాళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాకు చేరిన విత్తనాలన్నీ ఆర్‌బికెల్లో సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గత ఖరీఫ్‌ సీజన్లో 43,519 క్వింటాళ్లు విత్తనాన్ని సరఫరా చేశారు. ప్రస్తుత సీజన్‌ అంతటికీ కలిపి 51,476 మెట్రిక్‌ టన్నుల ఎరువులు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 7,259 మెట్రిక్‌ టన్నుల యూరియా, 782 మెట్రిక్‌ టన్నుల డిఎపి, 160 మెట్రిక్‌ టన్నుల ఎంఒపి, 501 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 131 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పి… మొత్తంగా 8,834 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సరఫరా చేశారు. గతేడాది సీజన్‌ మొత్తానికి 93,032 మెట్రిక్‌ టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. జిల్లాలో 27 మండలాల్లో 54 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 242 గ్రామాలకు చెందిన 44,789 మంది రైతుల ద్వారా 42,355 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. లోటు వర్షపాతంజిల్లా సాధారణ వర్షపాతం 1112 మిల్లీ మీటర్లు కాగా, గత ఏడాది (2023-24) 999 మి.మీ (-10.2 శాతం తేడాతో)గా నమోదైంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజను (జూన్‌ మొదటి వారం వరకు 124 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 74.4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.

➡️