ప్రగతి ప్రణాళికలు సిద్ధం చేయండి

Feb 3,2025 21:44

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలుపై మూడు రోజుల్లో ప్రగతి నివేదికలను తయారు చేయాలని వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిపై కలెక్టరేట్లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా 15 శాతం అభివృద్ది రేటు ఉండేలా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఏడాది ప్రణాళికలను, లక్ష్యాలను తయారు చేయడంపై అధికారులకు కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలపై సమీక్షిస్తూ, పదిరోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రగతి కనిపించాలని, మూడు నెలల ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ సేద్య పథకాలపై సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో రైతులను చైతన్య పరచాలని సూచించారు. ముఖ్యంగా బిందుతుంపర్ల సేద్యం, ఉద్యాన సాగు పెంపు, ఆయిల్‌పాం, నాణ్యమైన మొక్కల ఉత్పత్తి, డ్రోన్‌ టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. వీటిని నిరంతరం పర్యవేక్షించాలని జెసి సేతుమాధవన్‌కు సూచించారు. షెడ్యూల్‌ ప్రకారం జరపవలసిన శాఖాపరమైన సమావేశాలను నిర్ణీత వ్యవధిలోనే నిర్వహించాలని, లేదంటే దానికి ఆయా శాఖాధిపతులే బాధ్యత వహించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.పత్రికల్లో వచ్చిన వార్తలపై సమీక్ష వివిధ పత్రికల్లో వచ్చిన సానుకూల, వ్యతిరేక వార్తలపై ఈ సమావేశంలో కలెక్టర్‌ చర్చించారు. ఈ రోజు పలు పత్రికల్లో వచ్చిన వార్తలను చదివి వినిపించారు. ఇకనుంచీ పత్రికల్లో వస్తున్న వార్తలను ఏరోజుకారోజు పరిశీలించి, ఆ సమస్య పరిష్కారం అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పడు సమాచారంతో వార్తలు రాస్తే నేరుగా గానీ, సమాచార శాఖ ద్వారా గానీ వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జెసి ఎస్‌.సేతు మాధవన్‌, సిపిఒ పి.బాలాజీ, డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️