ప్రజాశక్తి- మెంటాడ :ఆండ్ర ప్రాజెక్టు ద్వారా తాగునీటిని 77 గ్రామాలకు అందిం చేందుకు రూ.95కోట్లతో ప్రతిపాదనలు పంపనున్నట్లు రక్షిత మంచినీటి పథకం డిఇ తిరుపతినాయుడు తెలిపారు. బుధవారం ఆండ్ర, లోతుగెడ్డ, కూనేరు నీటిఎద్దడి వున్న గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆండ్ర పంచా యతీలో కొండజీరికివలస, కుంబివలస, వేపగుడ్డి గ్రామాలను పరిశీలించి రూ.80లక్షలతో వాటర్ ట్యాంక్‌లు నిర్మించి కొళాయిల ద్వారా తాగునీటి సరఫరా చేస్తామన్నారు. కూనేరు పంచాయతీలో ఎగువ మిర్తివలస, దిగువ మిర్తివలస గిరిజన గ్రామాల్లో వాటర్ ట్యాంక్ నిర్మించి కొళాయిల ద్వారా తాగు నీరు అందేవిధంగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కొండ లింగాలవలస పంచా యతీ మధుర గిరిజన గ్రామాలు శీలవలస, సవరవిల్లిలో బోరుబావి తీసి ట్యాంక్ నిర్మించి తాగునీరు అందిస్తామన్నారు. ఈ పనులు వారం రోజుల్లో చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ పర్యటనలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, రక్షిత మంచినీటి పధక ఏఇలు నవీన్, శ్రీనువాసురావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి టి సోములు, స్థానిక నేత పడాల గంగునాయుడు, ఉపసర్పంచ్ దాసరి శ్రీనివాసరావు, కృష్ణవేణి, బంగారి సింహాచలం, రెడ్డిగౌరీస్ తదితరులు పాల్గొన్నారు.
