కేంద్ర బడ్జెట్ పై సిపిఎం రాస్తారోకో
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, తెలుగు ఆడపడుచు అయిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ రాష్ట్రానికి కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారన్నారు. విభజన చట్టంలోని అంశాలను నెరవేరుస్తామని చెప్పడం తప్ప ఎటువంటి కేటాయింపులు చేయలేదన్నారు. పోలవరానికి నిధులు లేవు, ఉత్తరాంధ్ర సుజలస్రవంతికి నిధులు కేటాయింపు లేదు, రైల్వే జోన్ ప్రస్తావన లేదు, జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయింపు లేదు, అమరావతి నిర్మాణానికి ప్రకటించిన 15 వెల కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పుకింద చెప్పడం దుర్మార్గమన్నారు. ఎటువంటి నిధులు కేటాయించకుండా కేంద్రం బడ్జెట్ పెడితే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయింపులు చేయకుండా కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను మరోసారి బిజెపి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేసిన బిజెపి ప్రభుత్వం విధానాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తగిన నిధులు కేటాయింపులు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో సిపిఎం నాయకులు ఏ.జగన్మోహన్, పి.రమణమ్మ, బి.రమణ, యు ఎస్ రవికుమార్, సి హెచ్ వెంకటేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
