ప్రజాశక్తి-బొబ్బిలి : ఫెంగల్ తుపాను ప్రభావంతో శుక్ర, శనివారాల్లో జిల్లాలో కురిసిన చిరుజల్లులు, వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా చిరుజల్లులతో వర్షం కురిసింది. వర్షాలకు పంట పొలాల్లో ఉన్న వరి పనలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు మొక్కజొన్న, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిపోయిన వరి పనలను రైతులు ఆరబెడుతున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
భోగాపురం : ఫెంగల్ తుపాను ప్రభావంతో వీచిన గాలులకు భోగాపురం మండలంలో పలుచోట్ల వరి చేను పొలాల్లో నేల వాలింది. కోతకొచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారుపేట, నందిగాం, ముంజేరు, భోగాపురం తదితర గ్రామాల్లో వరి పంట కోత దశలో ఉంది. ఇలాంటి సమయంలో వరిచేను ఇలా పడిపోవడంతో రైతులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో వేటకు వెళ్లరాదని మత్స్యకారులను అధికారులు హెచ్చరిస్తున్నారు.