- మున్సిపల్ కార్యాలయం ముట్టడి.. ఆరుగురు అరెస్టు
ప్రజాశక్తి – బొబ్బిలి (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పాకివీధి పక్కనున్న ఖాళీ స్థలంలో పారిశుధ్య కార్మికులు వేసుకున్న పాకలను మున్సిపల్, రెవెన్యూ, పోలీసులు బుధవారం తొలగించారు. ఆ స్థలంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆరిగంగయ్య చైర్మన్‌గా ఉన్న సమయంలో కార్మికులతో డబ్బులు కట్టించుకున్నారు. అయినప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. దీంతో పట్టాలివ్వాలని పలుమార్లు ఆందోళన చేసినా స్పందించకపోవడంతో కార్మికులు ఖాళీ స్థలాన్ని ఆక్రమించి పాకలు వేశారు. ఇదే స్థలంలో ప్రభుత్వం మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీన్ని కార్మికులు అడ్డుకున్నారు. అధికారులు పోలీసుల సమక్షంలో జెసిబితో పాకలను తొలగించారు. దీనిని నిరసిస్తూ పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఆందోళనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బైండోవర్ కేసులు రద్దు చేయకపోతే పోరాటం
ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పోరాటం చేసిన నాయకులు, కార్మికులపై బైండోవర్ కేసులు పెట్టడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసులను రద్దు చేయకపోతే పోరాడతామని హెచ్చరించారు.
పారిశుధ్య కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తాం : ఎమ్మెల్యే
పారిశుధ్య కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే బేబినాయన హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల ఆందోళన నేపథ్యంలో ఆయన స్పందించారు. కొంతమంది పారిశుధ్య కార్మికులు సిపిఎం నాయకులు శంకర్రావుతో కలిసి మున్సిపల్ కమిషనర్‌కు వినతి అందజేసి, ఎమ్మెల్యేకు పరిస్థితిని ఫోన్‌లో వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ స్థలాన్ని సమబంధిత అధికారులతో మాట్లాడి, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు.