అందని విద్యా హక్కు చట్టం

Nov 5,2024 20:43

ప్రజాశకి-విజయనగరం టౌన్‌:  పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్‌, ప్రయివేటు విద్య అందించడానికి తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. కిలోమీటరు దూరంలో నివాసం ఉండే విద్యార్థులకు మాత్రమే సమీపంలోని ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో అవకాశం కల్పించాలని ఈ చట్టంలోని నిబంధన పేద విద్యార్థులు ఆయా విద్యా సంస్థల్లో అడ్మిషన్లు తీసుకోవడానికి అడ్డంకిగా మారింది. విజయనగరం జిల్లాలో 2000 మంది విద్యార్థులు కార్పొరేట్‌, ప్రయివేటు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు తీసుకునే అవకాశం ఉండగా, కేవలం 1326 మంది మాత్రమే ప్రవేశాలు పొందగలిగారు.పేద విద్యార్థుల ప్రవేశాల్లో కోత !.2010 విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్‌, ప్రయివేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించాలి. జిల్లాలోని 400కు పైగా ప్రైవేటు విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరంలో లక్ష మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో సెక్షన్‌కు 40మంది విద్యార్థుల చొప్పున 400 విద్యా సంస్థల్లో సుమారుగా 9వేల మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే 2వేల మందికి పైగా పేద విద్యార్ధులకు ప్రయివేటు సంస్థల్లో ఉచితంగా అవకాశం కల్పించాల్సి ఉంది. కిలో మీటరులోపు నివాసం ఉండాలనే నిబంధన కారణంగా అత్యధికంగా సుమారుగా 700 మంది పేద విద్యార్ధులు ప్రవేశాలను పొందలేక పోయారు.గత విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో విద్యాహక్కు చట్టం అమలు పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి పేద విద్యార్థుల ప్రవేశాలకు అవకాశం కల్పించాలని జెడ్‌పిటిసి సభ్యులు విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ ఏడాది అధికారులు ప్రయివేటు పాఠశాలల ప్రవేశాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేశారు. అయితే కిలోమీటరులోపు విద్యార్థులను మాత్రమే పాఠశాలలో చేర్చుకోవాలనే నిబంధనలతోపాటు ఈ చట్టం ద్వారా పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరగలేదు.మూడు కిలోమీటర్లులోపు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విలీనానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోగా తాజాగా ప్రభుత్వం ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్ధుల ప్రవేశాలకు కిలోమీటరు దూరాన్ని ప్రాతిపదికగా తీసుకుంది. ఇలా ఒకపక్క ప్రాథమిక పాఠశాలలను దూరం చేసిన ప్రభుత్వం… మరోపక్క విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పేద విద్యార్థులు నష్టపోతున్నారు.

➡️