-బడ్జెట్‌లో విజయనగరంపై శీతకన్ను
-ఊసేలేని గిరిజన యూనివర్సిటీ
-జిల్లా కేంద్రాస్పత్రిలో కేన్సర్‌కు వైద్యసేవలు
-నేడు మండల కేంద్రాల్లో నిరసనలు : సిపిఎం
ప్రజాశక్తి-విజయనగరం కోట/టౌన్ : టిడిపి మద్ధతుపైనే ఆధారపడిన కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం జిల్లాకు కొత్త ప్రాజెక్టులు, ఆగిపోయిన వెనుకబడిన ప్రాంత నిధులు, గిరిజన యూనివర్శిటీ భారీగా నిధులు కేటాయిస్తుందని ఆశించిన ఉమ్మడి జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన 2025-26 కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు మొంచి చేయి చూపింది. సాధారణ కేటాయింపులు మినహా ప్రత్యేకించి నిధులు, ప్రాజెక్టులేవీ లేకపోవడంతో అంతా పెదవి విరుస్తున్నారు. వెనుక బడిన ప్రాంతాలకు ఏడాదికి రూ.50 కోట్ల గ్రాంట్ ఇస్తామని గతేడాది జూలై బడ్జెట్‌లో చెప్పిన ప్రభుత్వం ఈ సారి అదీ కూడా లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్శిటీకి ఇసుమంతైనా నిధులు కేటాయించకపోవడం పట్ల గిరిజనుల పట్ల బిజెపి ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతోంది. జిల్లా కేంద్రాస్పత్రుల్లో కేన్సర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో రోగులకు ఉపశమనం కలగనుంది. ఐదేళ్లలో 75వేల సీట్లు పెంచుతున్నట్లు ప్రకటించడంతో జిల్లాలోని మెడికల్ కళాశాలల్లో సీట్లు పెరగనున్నాయి. దీంతో మరింత మంది వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం కలగనుంది. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు.
జిల్లాలో తలపెట్టిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయింపులో మొండిచేయే చూపారు. ఈ బడ్జెట్ సమావేశంలోనైనా నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూసినవారికి నిరాశే ఎదురైంది. గిరిజన యూనివర్సిటీకి ఏటా అరకొర కేటాయింపులే జరుగుతున్నాయి. ఈసారి అది కూడా లేకపోవడంతో జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి. సరైన భవనాలు లేక తరగుతులు కూడా పరాయి పంచన నిర్వహించాల్సి వస్తోంది. మరడాం-మెంటాడ మండలం కుంటినవలస గ్రామాల పరిధిలో 560 ఎకరాలను వర్సిటీకి కేటాయించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశ్వ విద్యాలయాన్ని ఈ క్యాంపస్ నుంచే నిర్వహిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2027 నాటికి పూర్తి స్థాయిలో భవ నాలను అందు బాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. నిధులపై స్పష్టత లేకపోవడంతో పనులు ఎంత వరకు ముందుకు కదులుతాయన్నది సందిగ్ధమే. ఉమ్మడి జిల్లాలో 2.60లక్షల మంది రైతులు ఖరీఫ్, రబీ సీజన్‌లో కలిపి 4.80లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. అధికా రంలోకి వస్తే స్వామినాధన్ కమిషన్ అమలు చేస్తామని 2014లోనే బిజెపి ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు అమలు కాలేదు. మద్ధతు ధరలకు గ్యారంటీ చట్టం చేయాలని రైతులు ఇప్పటికీ ఆందోళనలు సాగిస్తునా కేంద్ర ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిని మొత్తాన్ని ప్రభుత్వం పెంచనుందనే ప్రచారం సాగినా బడ్జెట్‌లో పెంపు ప్రస్తావన లేకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందారు.
ప్రస్తావన లేని వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్
విభజన చట్టంలో పేర్కొన మేరకు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించడం తప్ప, అమలుపై చిత్తశుద్ధితో మాట్లాడలేదు. గతంలోనూ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పినా అమలు కాలేదు. విభజన చట్టం ప్రకారం ఏటా రూ.50కోట్ల చొప్పున జిల్లాకు ఇవ్వవాల్సిన బిజెపి ప్రభుత్వం ఒకే ఒక్క సంవత్సరం ఇచ్చి ఆ తరువాత కేటాయించిన నిధులు కూడా వెనక్కి తీసుకుంది. ఈ లెక్కన ఉమ్మడి విజయనగరం జిల్లాకు రూ.64కోట్లు మించి అందలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో అదికూడా ప్రకటించలేదు.జిల్లా కేంద్ర ఆసుపత్రికి కేన్సర్ సెంటర్ దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో కేన్సర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. దీంతో జిల్లా కేంద్రాస్పత్రిలో సెంటర్ ఏర్పాటు కానుంది. దీంతో కేన్సర్ పరీక్షలు, చికిత్స కోసం విశాఖతో పాటు జిల్లాలోని ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవస్థలు తప్పనున్నాయి.
కొత్త పన్ను విధానంపై వేతన జీవుల పెదవి విరుపు
ఆదాయపు పన్ను పరిమితి విషయంలో ఉద్యోగులు ఆశించినంతగా ఊరట దక్కలేదు. ఉద్యోగులు పొందే మూల వేతనంలో 12 లక్షల వరకు ఆదాయం పొందుతున్న వారికి పన్ను మినహాయించినా పాత స్లాబ్‌లే కొనసాగించడంతో పెద్ద ఒరిగేదేమీ ఉండడదని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కొత్త విధానం ప్రకారం రూ.4 లక్షల లోపు ఆదాయం పొందుతున్న వారికి పన్ను మినహాయింపు ఇస్తున్న నేపథ్యంలో దానిని మినహాయించి రూ.9.75 లక్షలకు ఆయా స్లాబ్‌ల ప్రకారం పన్ను మదింపు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 25వేల మంది, ఉపాధ్యాయులు 9600 మంది, పెన్షనర్లు 20వేల మంది ఉండగా వారిలో 7వేల మంది వరకు ప్రయోజనం పొందవచ్చునని అంచనా.
