ప్రజాశక్తి-బొబ్బిలి: బొబ్బిలి మున్సిపాలిటీలో గోతుల రోడ్లు కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు, పాలక వర్గానికి కాసులు కురుపిస్తున్నాయి. రోడ్డు గోతులు కాసులు కురిపించడం ఏమిటి అనుకుంటున్నారా.. రోడ్లుపై ఏర్పడిన గోతులను పూడ్చి వేసేందుకు మున్సిపల్ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పనులు చేయకుండా స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు, పాలకవర్గం ఒక్కటై మున్సిపల్ నిధులను స్వాహా చేస్తున్నారన్న చర్చ పట్టణంలో జోరుగా సాగుతుంది. రెవెన్యూ సెక్షన్‌లో కూడా అవినీతి పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. బైపాస్ రోడ్డు గోతులు పూడ్చివేతకు రూ.45లక్షలుమున్సిపాలిటీలో బైపాస్ రోడ్డు, జయప్రకాష్ మున్సిపల్ పాఠశాల ఎదురుగా ఉన్న రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో రాకపోకలకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి శ్రీదాడితల్లి ఆలయం జంక్షన్ వరకు బైపాస్ రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఉండడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో గోతులు పూడ్చేందుకు మున్సిపల్ సాధారణ నిధులు రూ.40లక్షలు కేటాయించారు. ఆ నిధులతో ఏడు నెలల క్రితం వెట్ మిక్స్‌తో గోతులను పూడ్చారు. నాసిరకం మెటీరియల్ వాడడంతో వెట్ మిక్స్ వేసిన రెండు నెలలు పూర్తి కాకముందే యథాస్థితికి గోతులు వచ్చాయి. దీంతో ప్రజల నుంచి విమర్శలు రావడంతో గోతులను పూడ్చేందుకు మరో రూ.5లక్షలు కేటాయించినప్పటికీ ఎక్కడ గోతులు అక్కడే దర్శనం ఇస్తున్నాయి. జయప్రకాష్ మున్సిపల్ పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఉండడంతో కొన్ని నెలల క్రితం గోతులు వద్ద జరిగిన ప్రమాదంలో ఒక బాలుడు మరణించారు. దీంతో గోతులను పూడ్చాలని స్థానికులు ఆందోళన చేయడంతో సుమారు 50మీటర్లు గోతులను పూడ్చేందుకు రూ.5లక్షలు ఖర్చు చేసినప్పటికీ నాసిరకం మెటీరియల్ వాడడంతో గోతులు యధావిధిగా ఉన్నాయి. గోతులను పూడ్చేందుకు లక్షల్లో నిధులు ఖర్చు చేస్తున్నా నాసిరకం పనులు చేసి నిధులను స్వాహా చేస్తున్నారన్న చర్చ పట్టణంలో బలంగా ఉంది.తక్కువ పనులు చేసి ఎక్కువ బిల్లు మున్సిపాలిటీలో మున్సిపల్ పాలక వర్గానికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి తక్కువ పని చేసి ఎక్కువ బిల్లులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్లుల్లో అక్రమాలు బయట పడతాయన్న భయంతో అభివృద్ధి పనులను పాలక వర్గానికి చెందిన కాంట్రాక్టర్‌కు మాత్రమే అప్పగిస్తున్నారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్లుగా 80శాతం పనులు పాలక వర్గానికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్‌కు మాత్రమే కేటాయించారన్న విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి పనులకు వేరే కాంట్రాక్టర్ టెండర్ వేసి పనులను దక్కించుకుంటే పనులు చేయనివ్వకుండా పాలకవర్గం, అధికారులు కలిసి అడ్డుకుంటున్నారని ఒక కాంట్రాక్టర్ వాపోయాడు. వాల్ పెయింటింగ్స్‌కు రూ.28లక్షలు కేటాయింపుపట్టణ సుందరీకరణలో భాగంగా రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి గోడలపై పెయింటింగ్ వేసి ఆకర్షణీయమైన బొమ్మలు వేసేందుకు రూ.18లక్షలు కేటాయించారు. ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి జ్యూట్ మిల్లు వరకు రోడ్డు డివైడర్‌కు రంగులు వేసేందుకు రూ.10లక్షలు కేటాయించారు. ఈ రెండు పనులను కూడా మున్సిపల్ పాలక వర్గానికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రెండు పనులలో భారీగా డబ్బులు మిగిల్చేందుకు నాసిరకం పనులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దంగా ప్రతిపక్షాలుమున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ అవినీతిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని గతంలో కౌన్సిల్ సమావేశంలో టిడిపి కౌన్సిలర్లు ప్రకటించారు. అవినీతికి అడ్డుకట్ట పడకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో ప్రతిపక్షాలు ఉన్నాయి.ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరుమున్సిపాలిటిలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేసేందుకు ఎమ్మెల్యే బేబినాయన పలు సూచనలు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు నాసిరకం పనులు చేసి నిధులు స్వాహా చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించకుండా పనులు నాణ్యతగా చేస్తున్న కాంట్రాక్టర్‌కు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్‌ను మారిస్తే అవినీతికి చోటు ఉండదని భావంతో ఎమ్మెల్యే బేబినాయన సూచనలను పక్కన పెట్టారన్న చర్చ జరుగుతుంది.