రోడ్డే రైతు బజార్‌

Jan 16,2025 20:21

ప్రజాశక్తి-బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలో రైతు బజార్‌ లేకపోవడంతో రైతులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు బజార్‌ ఏర్పాటు చేస్తామని పాలకులు హామీలు గుప్పిస్తున్నా ఆచరణలో అమలు చేయడం లేదు. 15 ఏళ్ల క్రితం రాజా కళాశాల సమీపంలోని డిసిసిబి స్థలంలో రైతు బజార్‌ ఏర్పాటు చేశారు. కానీ షాపుల నిర్మాణం చేపట్టక పోవడంతో కొన్ని నెలలు మాత్రమే రైతుబజార్‌ నడిచింది. రైతులు, చిరు వ్యాపారులు అమ్ముకునేందుకు తెచ్చిన కూరగాయలు, నిత్యావసర సరుకులను నిల్వ చేసుకునేందుకు అవకాశం లేదు. దీంతో రైతుబజారులో కూరగాయలు, నిత్యావసర సరుకులను విక్రయించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో రైతు బజార్‌ కొన్ని నెలలు మాత్రమే నడిచింది. బొబ్బిలిలో రైతు బజార్‌ ఏర్పాటు చేస్తామని గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఎఎంసి చైర్మన్‌ పువ్వల శ్రీనివాసరావు, వైసిపి ప్రభుత్వంలో ఎఎంసి చైర్మన్‌ బొమ్మి శ్రీనివాసరావు హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలు చేయలేదు. రైతు బజార్‌ లేకపోవడంతో రైతులు, చిరు వ్యాపారులు రోడ్లపై షాపులు పెట్టి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. బొబ్బిలి, పాతబొబ్బిలి, గొల్లపల్లి, మెట్టవలస, గొర్లెసీతారాంపురం, పెంట, కొత్తపెంట, జె.రంగరాయపురం గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. రైతుబజార్‌ లేకపోవడంతో కూరగాయలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వ్యాపారులు అడిగిన ధరలకు ఇచ్చి తీవ్రంగా నష్టపోయి దోపిడీకి గురవుతున్నారు. రైతు బజారు లేకపోవడంతో సిబిఎం బాలికోన్నత పాఠశాల ఎదురుగా, రాజా కళాశాల, గాంధీ విగ్రహం వద్ద రోడ్లపై కూరగాయల షాపులు పెట్టి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ…పట్టణంలో రైతుబజార్‌ లేకపోవడంతో రోడ్ల పక్కన షాపులు పెట్టిన వ్యాపారులు వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ వ్యాపారులు చేస్తున్నారు. వర్షాకాలంలో తడుస్తూ వ్యాపారం చేస్తున్నామని, వేసవి కాలంలో ఎండలకు కూరగాయలు ఎండిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు బజార్‌ ఏర్పాటు చేయాలని రైతులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు.

➡️