ప్రజాశక్తి – రామభద్రపురం : జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ఈ ఏడాది కాంప్రెన్సివ్ ప్రొటెక్టివ్ వాటర్ స్కీమ్ కింద రూ.40 కోట్లతో 34 రక్షితనీటి పథకాలు మంజూరైనట్టు జెడ్‌పి సిఇఒ వెంకటరమణ తెలిపారు. నీటి ఎద్దడి ఎక్కువ ఉన్న మండలాల్లో ఈ పథకాలు నిర్మాణం చేయనున్నామన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం నిధులతో ఈ పథకాలు మంజూరయ్యాయన్నారు. ఇందులో భాగంగా ప్రతీ మండలంలో క్రాష్ ప్రోగ్రామ్ ద్వారా బోర్డు మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఆయా మండలాల్లో నీటి ఎద్దడికి సంబంధించి నిధులు ఖర్చులు చేసుకొనేలా సూచించామన్నారు. ప్రతీ మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, తాగునీటి సమస్యలపై ఇక్కడ ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతీ మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి సంబంధించి మ్యాప్ ఒకటి ప్రదర్శించాలని, ఈ మ్యాప్‌లో హైస్కూళ్లు, రోడ్లు, ముఖ్య సమాచారం పొందుపరచాలని సూచించారు. పి4 సర్వేపై అపోహలు వద్దని, పేదరిక నిర్మూళన కోసం ప్రభుత్వం ఈ సర్వే చేస్తోందని, దీని వల్ల ఎటువంటి సంక్షేమ పథకాలు ఆపేదే లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 38.85 శాతం పి4 సర్వే పూర్తయిందన్నారు. జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల కొరత ఉందని, త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల్లో సంపద పెంచే మార్గాలు అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ కేంద్రాల వద్ద ఒక బోరు నిర్మాణం కూడా చేపట్టి బలోపేతం చేయాలని ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ రికార్డులు, ఉద్యోగుల పనితీరుపై సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిపిఆర్‌సి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బీఎస్కే పట్నాయక్, ఎంపిడిఒ రత్నం, ఎఒ సన్యాసిరావు, మండల పరిషత్ సినియర్ అసిస్టెంట్ చొక్కావు శ్రీరాములునాయుడు పాల్గొన్నారు.
