ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/విలేకర్ల బృందం
దేశమంటే మట్టి కాదోరు… దేశమంటే మనుషులోరు అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోరు… అని కూడా ఉద్బోధించాడాయన. ఆ మహాకవి దార్శనీకత, ముందుచూపు నేటి పాలకులను కూడా ప్రశ్నిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఉపాధి హామీలో భాగంగా ప్రభుత్వం మట్టి పనులు కల్పిస్తున్నప్పటికీ ఆ పనులు చేసిన కూలీలకు డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. సుమారు మూడు నెలలుగా కూలి చెల్లించకపోవడంతో లక్షలాది మంది కూలీలు పుట్టెడు అవస్థలతో ఈసురోమంటున్నారు. వీరి సమస్యలపై చర్చించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కూడా ఇటీవల జరిగిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి సమయం దొరకలేదంటే.. చిత్తశుద్ధి ఏపాటిదో వేరేగా చెప్పనక్కర్లేదు.
అసలే విజయనగరం జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. వ్యవసాయ ఆధారిత జిల్లా అయినా తగిన సాగునీటి వనరులు లేవు. ఈనేపథ్యంలో 2005లో అప్పటి యుపిఎ -1 ప్రభుత్వం కమ్యూనిస్టుల ఒత్తిడితో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏడాదిలో వంద రోజులపాటు పని గ్యారెంటీ కావడంతో వ్యవసాయ కార్మికులు, చిన్న, మధ్య తరగతి రైతులు, ఇతర వృత్తిదారులకు ఈ చట్టం ఎంతో ఆసరాగా నిలుస్తోంది. కేవలం దీనిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. దేశంలోనే అందరికన్నా ఎక్కువ పనిదినాలు ఉపయోగించుకుంటున్న జిల్లాగా గుర్తింపు పొందడం, అవార్డులు, రివార్డులు అందుకోవడం ఇందుకు తార్కాణంగా చెప్పొచ్చు. ఇటువంటి ఉపాధి హామీ ద్వారా పనిచేసిన కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో కూలీలు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. జిల్లాలో 3.84 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీరంతా ఈ ఏడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు చేసిన 32 వేల పనిదినాలకు గాను రూ.67.51 కోట్ల బకాయి ఉంది. కూలీలు పని అడిగిన వెంటనే కల్పించడంతోపాటు 14 రోజుల్లోపు చెల్లింపులు కూడా చేయాలని, లేదంటే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఉపాధి హామీ చట్టం చెబుతోంది. ఈ నిబంధనలను, ముఖ్యంగా చెల్లింపు విషయాల్లో తరచూ ప్రభుత్వం అతిక్రమించడం, ఈసారి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మూడు నెలలపాటు వేతనాలు చెల్లించకపోవడంతో సర్కారు ఉద్దేశ పూర్వకంగానే ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వేతనాలు అందకపోవడంతో నిత్యావసర సరుకులు కొనుక్కోలేకపోతున్నామంటూ కొందరు, ఉగాది కూడా సరదాగా చేసుకోలేకపోయామంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు, ఉద్యోగులు, అధికారులకు వేతనాలు ఇవ్వకపోతే ఇలాగే ఊరుకుంటారా? అంటూ మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.
చీపురుపల్లిలో రూ.3 కోట్లు బకాయి
చీపురుపల్లి మండలంలో ఉపాధి హామీ కూలీలకు రూ.3 కోట్ల వరకు బకాయి ఉంది. మండలంలో ఫిబ్రవరి నెలలో 6 వేల మంది, మార్చిలో 3500 మంది, ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు 3200 మంది వేతనదారులు ఉపాధి పనులు చేశారు. మొత్తం 12,700 మంది పనులు చేయగా, వీరికి బకాయి రూ.3 కోట్లు వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
కూలీల ఆందోళన
శృంగవరపుకోట మండలంలోని 26 పంచాయతీల పరిధిలో 232 ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉపాధి కూలీలకు గత ఎనిమిది వారాల నుంచి బిల్లులు అందడం లేదు. దీంతో కూలీలు జీవనం గడవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బకాయి వేతనాలు చెల్లించాలని సిపిఎం ఆధ్వర్యంలో పలుమార్లు ఎంపిడిఒ కార్యాలయం వద్ద కూలీలు ధర్నా నిర్వహించారు. బిల్లులు వెంటనే విడుదల చేయాలని వినతి పత్రాలను సైతం అందజేశారు.
3 నెలలుగా అందని కూలి
నెల్లిమర్ల మండలంలో మూడు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించడం లేదు. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు కూలి ఇవ్వలేదు. మండలంలో సుమారు 3 వేల మంది ఉపాధి వేతనదారులకు రూ.1.50 కోట్లు వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీంతో కూలీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇబ్బంది పడుతున్నాం
మూడు నెలలు నుంచి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నా. ఇంతవరకూ వేతనాలు చెల్లించలేదు. వేతనాలు అందకపోవడం కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే వేతన బకాయిలు చెల్లించి ఆదుకోవాలి.- సాయి దుర్గ, కొత్తపేట, నెల్లిమర్ల
