దిష్టిబొమ్మల్లా అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు

Jan 13,2025 20:04

ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌: నగరంలో నిర్మాణం జరిగిన ఏడు అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలు దిష్టిబొమ్మల్లా ఉన్నాయి. ఎన్నికల ముందు కొన్ని ప్రారంభించినప్పటికీ నేటికీ ఆరోగ్య సేవలు అందించడం లేదు. ఎన్నికల ముందు విజయనగరంలోని 45వ డివిజన్‌ కెఎల్‌ పురంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హడావుడిగా ప్రారంభించారు. ఇక నుంచి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఇప్పటికీ ఆ భవనానికి తాళాలు వేసే ఉన్నాయి. పశువులు, గొర్రెలకు, మద్యం తాగుబోతులకు నివాస ప్రాంతంగా మారింది. ఎన్నికల స్టంట్‌ కోసం హడావుడిగా అప్పటి వైసిపి పాలకులు ప్రారంభించారు తప్ప వైద్య సేవలకు నేటి వరకు నోచుకోలేదు. ఇప్పటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదు. నీటి సదుపాయం లేదు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మాణం చేస్తుండటంతో అర్బన్‌ కేంద్రానికి వెళ్లేందుకు దారి కూడా లేదు. ఇక్కడ కొండ ప్రాంతం ఉండడంతో భూగర్భ జలాలు లేవు. దీంతో దూర ప్రాంతంలో బోరు వేసి, అక్కడి నుంచి పైపులైన్లు వేయాలి. కానీ ఆ పనులు నేటికీ జరగలేదు. మరో వైపు ధర్మపురి, బాబామెట్ట, వైఎస్‌ఆర్‌ నగర ప్రాంతాల్లో నిర్మించిన కేంద్రాలు కూడా దిష్టిబొమ్మల్లా ఉన్నాయి. ప్రభుత్వాలు మారాయి తప్ప అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలు వినియోగంలోకి రాలేదు. ఒక్కొక్క అర్బన్‌ హెల్త్‌ కేంద్రం రూ.80 లక్షలతో నిర్మించారు. నిర్మాణాలు పూర్తయినా వినియోగంలోకి తేకపోవడం పట్ల విమర్శలువ్యక్తమవుతున్నాయి. వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితుల్లో వినియోగంలోకి తీసుకొని రావాల్సిన అధికార యంత్రాంగం కళ్ళు అప్పగించి చూస్తోంది తప్ప ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చి నగర వాసులుకు వైద్య సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు.

➡️