ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉర్రూతలూగించే జానపద గీతాలు.. జనాన్ని చైతన్యం చేసే గేయాలు.. సినిమా పాటలకు అదిరిపోయే స్టెప్పులు.. ఆద్యంతం రక్తికట్టించేలా నాటక ప్రదర్శనలు.. విద్యార్థినుల ఆత్మరక్షణకు సంబంధించిన కరాటే విద్య… ఇలా ఒకటా రెండా.. ఆకట్టుకునే అనేక ప్రదర్శనలు.. వీటికి సామాజిక కోణాన్ని జోడిస్తే..? ఇంకేముంది అదిరిపోతుంది కదూ! అలాంటి దృశ్యాలను సాక్షాత్కరించింది భగత్‌సింగ్ స్టూడెంట్ ఫెస్ట్. విజ్ఞానం, వినోదం మేళవింపుతో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం కన్నులపండువగా సాగింది. విద్యార్థులు, యువత, మేధావులు, నగర ప్రజలను హోరెత్తించింది. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిర్వహించిన భగత్‌సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ శనివారం ఆరంభమైంది. ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన ర్యాలీ నగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద ప్రారంభమై, బాలాజీ జంక్షన్ మీదుగా గురజాడ కళాభారతి ఆడిటోరియం వరకు సాగింది. ఎస్‌ఎఫ్‌ఐ జెండాలు చేబూని వాలంటీర్లు ముందు నడవగా, వారివెంట భారీసంఖ్యలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు కదంతొక్కారు. అనంతరం ఆ ఆడిటోరియం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.రాము అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో ముందుగా భగత్‌సింగ్, గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతోపాటు సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్ ప్రసంగించారు. ఫెస్ట్ లక్ష్యాన్ని, మూడు రోజులపాటు సాగే కార్యక్రమాలను ఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ వెల్లడించారు.ఆకట్టుకున్న నృత్యాలు, పాటలు భగత్‌సింగ్ ఫెస్ట్ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు పాడిన విప్లవ గేయాలు, సినీ గీతాలు శ్రోతలను అలరించాయి. జానపద కళాకారుడు జానకిరామ్ ఫెస్ట్ ప్రాధాన్యత వివరిస్తూ మాట్లాడటం, ఆయన బృందం పాడిన జానపదులకు విద్యార్థులు గొంతు కలిపి పాడి అలరించారు. విజయనగరం బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ ప్రదర్శన ఫెస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫెస్ట్‌లో విద్యార్థులకు నిర్వహించిన పాటల పోటీల్లో విజేతలుగా ఎన్.తేజేశ్వణి మొదటి స్థానం, డి.శ్రావణి రెండో స్థానం, లాస్యవీణ మూడో స్థానం సాధించారు. విజేతలకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సుబ్బరామమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, చీకటి దివాకర్, జానపద కళాకారుడు జానకిరామ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
నేటి యువత డ్రగ్స్‌కు బానిసవుతున్నారు. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల వల్ల వచ్చే ఆనందం కంటే విజ్ఞానం, వినోదంతో ఎంతో ఆనందం ఉంది. దీన్ని చాటిచెప్పేందుకు భగత్‌సింగ్ ఫెస్ట్ ఏర్పాటు చేశాం. నేడు అశాస్త్రీయ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. అందుకే స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా ఈ ఫెస్ట్ ఏర్పాటు చేశాం. మూడు రోజుల పాటు ఆటపాటలు, సైన్స్ ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– పి.రామ్మోహన్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు
దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో గంజాయికి ఎక్కువగా యువత బానిస అవుతున్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నా యువత వల్ల ఎటువంటి ప్రమాదం ఉంటుందనే భయంతో మహిళలు జీవిస్తున్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, డ్రగ్స్‌పై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఫెస్ట్ సాగుతుంది.
– పావని, ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు
దేశమంటే మట్టి కాదోరు.. దేశమంటే మనుషులోరు.. అన్న గురజాడ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి. యువతలో వస్తున్న, పేరుకు పోతున్న పెడధోరణులకు వ్యతిరేకంగా అవగాహన, చైతన్యం తీసుకొచ్చేందుకు ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న కృషి అభినందనీయం.
– చీకటి దివాకర్,సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్