సొంత వైద్యం.. కొత్త రోగాలకు ఆస్కారం

Jun 10,2024 19:11

ప్రజాశక్తి-విజయనగరం కోట : సొంత వైద్యం కొత్త రోగాలకు ఆస్కారం ఇస్తుందని ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.పద్మలీల అన్నారు. సోమవారం జిల్లా కేంద్రాస్పత్రి వద్ద సొంత వైద్యం.. అనర్థాయికం, హానికరం అనే కార్యక్రమాన్ని హెచ్‌ఒడి డాక్టర్‌ అన్నపూర్ణ, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ఆస్పత్రి నుంచి మెయిన్‌ గేటు వరకు ర్యాలీగా వెళ్లి, ప్రజలకు, రోగులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యమన్నారు. ఇటీవల కాలంలో యూట్యూబ్‌, వాట్సాప్‌ తదితర మాధ్యమాలను చూసి, ప్రజలు కొన్ని రోగాలకు సొంత వైద్యం చేసుకుంటున్నారని, ఆ విధానం ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంజెక్షన్‌, మాత్ర ఏదైనా వైద్యుల సలహా మేరకే తీసుకోవాలని సూచించారు. ఆర్‌ఎంపిలు వైద్యులు కాదని, ప్రథమ చికిత్స వైద్య సలహాదారులు మాత్రమేనని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఒ ఎం.సురేష్‌, హెచ్‌ఒడిలు డివిఎల్‌, రమణీ, అజరు, డాక్టర్‌ సురేష్‌, అమ్మన్నమ్మ, ఆమోజీరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️