సిబిఎం పాఠశాల అమ్మకం దుర్మార్గం

Oct 1,2024 21:12

ప్రజాశక్తి- బొబ్బిలి : చరిత్రాత్మక సిబిఎం బాలికోన్నత పాఠశాల స్థలాన్ని అమ్మివేయడం దుర్మార్గమని సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.గోపాలం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. సిబిఎం పాఠశాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన కరస్పాండెంట్‌ రత్నకుమార్‌ను, కొనుగోలు చేసిన వైసిపి నేతను అరెస్టు చేసి అక్రమ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాఠశాల వద్ద వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్న సిబిఎం పాఠశాల స్థలాన్ని వైసిపి నాయకుడు పేరు మీద స్థల మార్పిడి రిజిస్ట్రేషన్‌ చేయడం అన్యాయమన్నారు. పట్టణ నడిబొడ్డున రూ. 100కోట్లు విలువ చేసే స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని ప్రశ్నించారు. పాఠశాల కరస్పాండెంట్‌ బ్రోకర్‌గా వ్యవహరించి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేశారని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసిన వారిపై, చేపించుకున్న వారిపైన కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, అక్రమ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాతభవనంలో మౌలిక సౌకర్యాలు కల్పించి పాఠశాల గుర్తింపును రెన్యూవల్‌ చేసి తరగతులు కొనసాగించకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌ నాయకులు సునీల్‌, ఎఐఎస్‌ఎఫ్‌ డివిజన్‌ కార్యదర్శి శ్రావణ్‌ కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.సిబిఎం ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలుసిబిఎం ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూసేందుకే స్థల మార్పిడి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు కరస్పాండెంట్‌ రత్నకుమార్‌ చెప్పారు. సిబిఎం పాఠశాలకు వచ్చిన రత్నకుమార్‌ను వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు ఘెరావ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబిఎం ఎలిమెంటరీ పాఠశాలకు అనుసరించి ఉన్న స్థలం, సిబిఎం బాలికోన్నత పాఠశాల ఎదురుగా ఉన్న స్థలం ఇప్పటికే అన్యాక్రాంతం అయిందని, మిగిలి ఉన్న స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు కోమటిపల్లిలో మూడు ఎకరాల స్థలం, ఒక భవనాన్ని సిబిఎం పాఠశాలకు తీసుకుని పట్టణంలో ఉన్న పాఠశాల స్థలాన్ని మార్పిడి చేసి రిజిస్ట్రేషన్‌ చేశామని చెప్పారు. పాఠశాల పాత భవనంలో కొనసాగించాలంటే కొనసాగిస్తామన్నారు. స్థలం రిజిస్ట్రేషన్‌ చేయాలని సిబిసిఎన్‌సి ప్రధాన కార్యాలయంలో నిర్ణయం చేయడంతో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు చెప్పారు.

➡️