భూముల్లోకి వెళ్లేలా సర్వీస్‌ రోడ్డు వేయండి

Mar 19,2025 20:51

ప్రజాశక్తి – భోగాపురం : విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో రైతులకు సర్వీస్‌ రోడ్డును ఇవ్వాలని నాయకులతో పాటు రైతులంతా ఆర్‌డిఒ దాట్ల కీర్తిని కోరారు. ప్రస్తుతం రైతులు పొలాల్లోకి వెళ్లకుండా వేస్తున్న కంచెను సైతం నిలిపివేయాలని కోరారు. దీనిపై ఆర్‌డిఒ స్పందించి ఈ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. అంతవరకు కంచెను వేయకుండా నిలిపివేయాలని జిఎంఆర్‌ సిబ్బందికి ఆర్‌డిఒ ఆదేశాలు ఇచ్చారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి వెళ్లే రోడ్డులో రైతులు తమ పొలాల్లోకి వెళ్లకుండా అడ్డంగా ఇనుప కంచెను వేస్తున్నారు. ఇనుప కంచె వేస్తే పొలాల్లోకి వెళ్ళేది ఎలా అంటూ గత నెల 27వ తేదీన ప్రజాశక్తిలో ప్రత్యేక కథనం వెలువడింది. దీంతో రైతులు మేల్కొని ఇటీవలి జిల్లా కలెక్టర్‌ను ఈ సమస్యపై కలిశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్‌డిఒ విమానాశ్రయ రహదారిని పరిశీలించేందుకు బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. గూడెపువలస సర్పంచ్‌ మట్టా అయ్యప్ప రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయ రహదారికి భూములిస్తే తమ భూములకు విలువ పెరుగుతుందని రైతులంతా భూములు ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు అదే రైతులు తమ పొలాల్లోకి వెళ్ళకుండా కంచె వేయడం వల్ల చాలా ఇబ్బందులు పడతామన్నారు. అందుకు ఖచ్చితంగా సర్వీస్‌ రహదారి ఇవ్వాలని కోరారు. రహదారి వేసేటప్పుడు చెరువును కప్పకుండా వేస్తామని గతంలో చెప్పి ఇప్పుడు ఏకంగా చెరువును కప్పేస్తున్నారని ఏ రావివలస సర్పంచ్‌ ఉప్పాడ శివారెడ్డి తెలిపారు. ఈ చెరువు వ్యవహారంలో జిఎంఆర్‌ హెడ్‌ రామరాజుకు శివారెడ్డికి మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. రావివలస జంక్షన్‌ నుంచి కంచేరు వరకు వంద అడుగులకు రహదారికి ఇదివరకే భూ సేకరణ చేశారని ఆ రోడ్డును వెడల్పు చేస్తే బాగుంటుందని జనసేన నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆర్‌డిఒను కోరారు. వేసవి కాలం కావడంతో గాలికి మట్టి ఎగిరి గ్రామాలపైకి వస్తుందని దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గాలికి మట్టి ఎగరకుండా తడపమని చెప్పి ఎన్నిసార్లు చెబుతున్నా సరే జిఎంఆర్‌ సంస్థ పట్టించుకోవడంలేదని అయ్యప్ప రెడ్డితో పాటు నాయకులు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, యర్రప్పల నారాయణ ఆర్‌డిఒ దృష్టికి తీసుకువచ్చారు. మట్టిని నీటితో తడుపుతామని జిఎంఆర్‌ సంస్థ రామరాజు హామీ ఇచ్చారు. గూడెపువలస సమీపంలోని ఉన్న ఆలయాలపై మట్టి పడకుండా ఆలయం చుట్టు 20 అడుగుల ఎత్తున రేకులు వేస్తామని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా : ఆర్‌డిఒ’మీరు నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను శుక్రవారం జరిగే సమావేశంలో ఉన్నతాధికారుల దృష్టికి నేను తీసుకెళ్తా’ అని ఆర్‌డిఒ కీర్తి తెలిపారు. ఈ రహదారి వెంబడి ఇనుప కంచె వేయడం వల్ల ఎంతమంది రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందో వివరాలు సేకరించి నివేదిక ఇస్తామన్నారు. రైతులు సహకరించడం వల్లనే ఇంతవరకు విమానాశ్రయం పనులు వేగవంతరంగా జరుగుతున్నాయని అందుకు రైతులను ఇబ్బంది పెట్టబోమని చెప్పారు. తహశీల్దార్‌ ఎమ్‌.సురేష్‌, సవరవల్లి సర్పంచ్‌ ఉప్పాడ విజయ భాస్కర్‌ రెడ్డి, దల్లిపేట మాజీ సర్పంచ్‌ దల్లి శ్రీనివాసరావు, జిఎంఆర్‌ సంస్థ ప్రతినిధి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

➡️