ఇరుకు గదుల్లోనే సేవలు

Jan 16,2025 20:22

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని 39 గ్రామ పంచాయతీలలో 25 సచివాలయాల నిర్మాణాలకు గత ప్రభత్వం ఒక్కో సచివాలయానికి రూ.25లక్షల నుంచి రూ.30లక్షలు వరకూ మంజూరు చేసింది. వీటి నిర్మాణాలను చాలా చోట్ల స్థానిక నాయకుల కనుసన్నాల్లోనే జరిగాయి. కొన్ని సచివాలయాల్లో పనులు పూర్తి చేసి ప్రారంభించేశారు. మరికొన్ని సచివాలయాల్లో స్లాబ్‌ స్థాయి వరకు వచ్చి పనులు నిలిచిపోయాయి. 25 సచివాలయాలలో కేవలం 9 సచివాలయాలు మాత్రమే పూర్తి చేసి ప్రారంభించారు. 16 సచివాలయాలు పూర్తి చేయక సచివాలయ ఉద్యోగులు ఇరుకు గదిలోనే విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అంబాడ వెంకటాపురం సచివాలయంలో 26 లక్షల రూపాయలతో సర్పంచ్‌ చుక్కా వెంకటినాయుడు పనులు చేపట్టి స్లాబ్‌ స్థాయికి వచ్చినప్పటికీ పనులు నిలుపుదల చేశారు. చేసిన పనులకు నాణ్యతా ప్రమాణాలు లేక ఎక్కడ పడితే అక్కడ పెచ్చులుడుతున్నాయి. సంకిలి, బూరాడ, ఉంగరాడ, సచివాలయాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉణుకూరు, రేగిడి సచివాలయాలు పూర్తిస్థాయిగా నిర్మాణాలు చేపట్టక గాలికి వదిలేశారు. అంబకండి, చిన్న శిర్లాం, వెంకంపేట, దేవుదల, తోకలవలస సచివాలయాలు పూర్తి చేసి ప్రారంభాలు జరిగి సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న సచివాలయాలు నిధులు ఏమైనట్లు అని ఆయా గ్రామాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి అసంపూర్తిగా ఉన్న సచివాలయాలను పూర్తి చేయించి అందుబాటులోకి తేవాలని ఆయా సచివాలయ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ప్రజాశక్తి మండల జెఇ రియాజ్‌ను ప్రశ్నించగా 25 సచివాలయాలకు నిధులు పుష్కలంగా ఉన్నాయని, 9 పూర్తిగా కాగా 16 సచివాలయాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. ఉణుకూరు, రేగిడి పనులు ప్రారంభించలేదన్నారు.

➡️