బాలికపై లైంగిక దాడి

Oct 28,2024 21:08

 ప్రజాశక్తి-విజయనగరంకోట : చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన అత్యంత అమానుషమని, దీన్ని ప్రతీఒక్కరూ ఖండించాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. గంట్యాడ మండలంలోని ఒక గ్రామంలో ఆదివారం అత్యాచారానికి గురై, ఘోషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడున్నర ఏళ్ల బాలిక కుటుంబాన్ని మంత్రి సంధ్యారాణి సోమవారం పరామర్శించారు. వారికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించారు. మెరుగైన చికిత్సను అందించాలని, అవసరమైన ఇతర వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మానవత్వాన్ని మంట గలిపిన ఇటువంటి మానవ మృగాలకు కఠినంగా శిక్షపడాలన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడికి బెయిల్‌ ఇప్పించవద్దని న్యాయవాదులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి, నిందితుడికి వీలైనంత త్వరగా శిక్ష పడేవిధంగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. తల్లితండ్రులు ఆడపిల్లలతోపాటు మగ పిల్లలకు కూడా మంచిచెడుల విచక్షణను బోధించాలని సూచించారు. ఆడపిల్లలను రక్షించుకొనే బాధ్యత మనపై ఉందని మంత్రి అన్నారు. ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామని, అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి, విచారణ జరిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మంత్రి వెంట ఐసిడిఎస్‌ పీడీ మంత్రి సంధ్యారాణితోపాటు ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతకుమారి, ఆసుపత్రి వైద్యులు ఉన్నారు.
సంఘటన జరిగిందిలా
అనకాపల్లికి చెందిన దంపతులు తన కుమార్తెతో పాటు గంట్యాడ మండలంలోని ఓ గ్రామానికి ఆదివారం ఫంక్షన్‌కు వెళ్లారు. అందరూ ఆ ఫంక్షన్‌ హడావుడిలో ఉండగా, అదే గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఆ బాలికను సమీపంలోని తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆయువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మహిళా పోలీసుస్టేషన్‌ సిఐ నర్సింహమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాధ్యులను కఠినంగా శిక్షించాలి
మంత్రి కొండపల్లి
చిన్నారిపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. అమరావతిలో ఉన్న మంత్రి ఈ సంఘటన వివరాలు తెలుసుకుని సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకర్రావు ఈ సంఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
పునరావృతం కానివ్వొద్దు
జెడ్‌పి చైర్మన్‌ శ్రీనివాసరావు
విజయనగరం టౌన్‌ : చిన్నారిపై అకృత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.

➡️