ఆర్థిక బకాయిల చెల్లింపుపై చర్చించాలి

Mar 11,2025 21:04

ప్రజాశక్తి – బొబ్బిలి : ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పాలనలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్ధిక బకాయిలపై చర్చించాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కౌన్సెల్లర్‌ జె సి రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక ఎపిటిఎఫ్‌ కార్యాలయంలో ఎపిటిఎఫ్‌ మండల శాఖ అధ్యక్షులు సిహెచ్‌జె ప్రవీణ్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జెసి రాజు మాట్లాడారు. గత ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగ ఉపాధ్యాయులను మభ్యపెట్టి బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారం, బాకాయిల చెల్లింపులపై చర్యలు తీసుకుంటుదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, నేటికి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో తీవ్ర నిరాశతో, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. నేటికి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా ఏ ఒక్క క్యాబినెట్‌ సమావేశంలో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను కనీసం చర్చించలేదన్నారు. 12వ వేతన సంఘాన్ని నియమించటం మధ్యంతర భృతి ప్రకటన చేయటంపై క్యాబినెట్‌లో చర్చించి 27 శాతాన్ని ఐఅర్‌గా ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బంకురు జోగినాయుడు, సీనియర్‌ కార్యకర్త నాగేశ్వర రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

➡️