ప్రజాశక్తి-బొబ్బిలి: క్రీడాకారుల కోసం ఐటిఐ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి 2018లో అప్పటి టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రి సుజయకృష్ణ రంగారావు శంకుస్థాపన చేశారు. పునాదుల వరకు పనులు పూర్తిచేశారు. 2019లో వైసిపి అధికారంలోకి రావడంతో టిడిపి మంజూరు చేసిన నిధులను వెనక్కి తీసుకుంది. దీంతో క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని క్రీడాకారులు డిమాండ్ చేయడంతోపాటు టిడిపి చేపట్టిన సెల్ఫీ ఆందోళనలో భాగంగా ఇండోర్ స్టేడియం వద్ద ప్రస్తుత ఎమ్మెల్యే బేబినాయన సెల్ఫీ తీసుకుని నిరసన తెలిపారు. టిడిపి సెల్ఫీ నిరసనతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి వైసిపి ప్రభుత్వం 2023లో బుడా నిధులు రూ.1.15 కోట్లు మంజూరు చేసింది. 2023 నవంబర్ 9న నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన బేబినాయన స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను పరిశీలించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవన పనులు నత్తనడకన సాగడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.
