శాఖలో తప్పులు సరిదిద్దుతా.. క్షమించండి

Mar 12,2025 21:17

ప్రజాశక్తి – చీపురుపల్లి : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీపురుపల్లి శాఖలో వినియోగదారులకు ఇబ్బందులను భవిష్యత్తులో జరగకుండా తప్పులు సరిదిద్దుతాను క్షమించండి అంటూ ఆ శాఖ ఎజిఎం ఎం సురేష్‌ కుమార్‌ బ్యాంకు ఖాతాదారులకు క్షమాపణ చెప్పారు. చీపురుపల్లి స్టేట్‌ బ్యాంక్‌ శాఖలో ఒకరిద్దరు ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా బ్రాంచ్‌ మేనేజర్‌తో కలుపుకొని వినియోగ దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పలువురు ఖాతాదారులు స్టేట్‌ బ్యాంక్‌ శాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం సాయంత్రం స్థానిక శాఖలో ఖాతా దారులతో పాటు ఉద్యోగులను కూడా సమావేశ పరిచి ఎజిఎం వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వినియోగ దారులు ఒక్కొక్కరిగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎజిఎం దృష్టికి తీసుకొచ్చారు. వినియోగదారులంటే కనీస గౌరవం లేకుండా బ్యాంకు ఉద్యోగులు తమని అవమాన పరుస్తున్నారంటూ, ఒక్క నిమిషం లేటయినా పని పూర్తి చేయ డానికి నానా తిప్పలు పెడుతున్నారని ఎజిఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఎజిఎం ఖాతాదారులతో మాట్లాడుతూ బ్యాంకులో ఎజిఎం స్థాయిలో ఉన్నప్పటికీ చీపురుపల్లి శాఖకు సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఫిర్యాదులూ రాకుండా బ్యాంక్‌ మేనేజర్‌ స్థాయి ఉద్యోగాన్ని కూడా తన బాధ్యతగా తీసుకుంటానని వినియోగదారులకు వివరించారు. ఏడాది కాలంగా ఈ శాఖలో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఆయన మందలించారు. భవిష్యత్తులో ఎటువంటి ఫిర్యాదులున్నా ఖాతాదారులు నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని ఎజిఎం తన ఫోన్‌ నెంబర్‌ను వినియోగదారులకు అందజేశారు. ఫిర్యాదు చేసే వినియోగదారులు కూడా ఏ ఉద్యోగి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారో పేరుతో పాటు ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు. బ్యాంకు వేళలను ఉద్యోగులు ఎందుకు కచ్చితంగా పాటించడంలేదని, నాలుగు గంటలకే బ్యాంకును ఎందుకు క్లోజ్‌ చేయవలసి వస్తుందని ఆయన ఉద్యోగులను ప్రశ్నించారు. వినియోగదారుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించడంతోపాటు ఉద్యోగులంతా పని వేళల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండాలని ఎజిఎం ఉద్యోగులను హెచ్చరించారు. శాఖలో ప్రతి ఖాతాదారుడికి గౌరవప్రదమైన సేవలు అందజేయకపోతే ఉద్యోగులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బ్యాంక్‌ ఉద్యోగులతో పాటు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

➡️