ప్రజాశక్తి – పూసపాటి రేగ : భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో జాతీయ రహదారిలో గల బ్లాక్స్ స్పాట్స్‌ను బుధవారం ఎస్‌పి వకుల్ జిందాల్ పరిశీలించారు. అనంతరం ఆయన పూసపాటిరేగ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 75 సెంట్లు పోలీసుల స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ మూడు మండలాలను ఆనుకుని 32 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉందని ఇందులో 16 బ్లాక్ పాయింట్స్ ఉన్నాయన్నారు. ఆ పాయింట్స్‌లో ప్రమాదాల నివారణ ఎలా అన్నదానిపై చర్చించి నిర్ణయిస్తామన్నారు. రహదారి వెంబడి రైలింగ్ పటిష్టం చేస్తామన్నారు. సర్వీసు రోడ్డుకు వెళ్తున్న రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. హైవే వెంబడి లైటింగ్స్ పెంచేలా అధికారులతో మాట్లాడుతామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని గతేడాదితో పోల్చితే ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య తగ్గించలేకపోయినా పెరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిఐ రామకృష్ణ, ఎస్‌ఐలు దుర్గాప్రసాద్, సన్యాసినాయుడు తదితరులు ఉన్నారు.
