రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌

Nov 30,2024 21:51

ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై వినతుల స్వీకరణ కోసమే ఈ గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంత్రి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. మంత్రి అనిత మాట్లాడుతూ భూముల ఫ్రీహోల్డ్‌కు సంబంధించి సుమారు 490 ఎకరాల వరకు అవకతవకలు జరిగినట్లు తేలిందని, బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎక్సైజ్‌ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని, బెల్టుషాపులు ఎక్కడా లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకూడదని స్పష్టంచేశారు. దీనికోసం ఇప్పటినుంచే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ధాన్యం తడిచి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీల భర్తీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి చెప్పారు. ఇళ్లపై ఉన్న, వేలాడుతున్న విద్యుత్తు తీగలను తొలగించేందుకు సమగ్ర సర్వే నిర్వహించి, నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నిర్ణీత గడువులోగా ఏర్పాటు చేయకపోతే, కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ను సందర్శించి, కేటాయింపులపై సమీక్షిస్తామని చెప్పారు. జిల్లాలో చెరకు సాగు పెరిగిందని, రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యుత్‌ శాఖలో ఎఇలు, లైన్‌మెన్ల ఖాళీల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. జిల్లాకు క్రీడా పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో దీనిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాటిపూడి జలాశయానికి గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరును పునరుద్ధరించాలని కోరారు. అందుబాటులో చెరకు సేకరణ పాయింట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్తు తీగలు కిందకి వేలాడటం, ఇళ్లపై ఉండటం వల్ల పలువురు ప్రమాదాల బారిన పడి ప్రణాలను కోల్పోతున్నారని, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో 11 మండలాల్లో సుమారు 41 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్‌లైన్లు కాలువల్లో ఉన్నాయని, వీటిని వారం పదిరోజుల్లో బయటకు తీసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేనివారికి ఉపాధిహామీ కింద మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. ఎమ్‌పి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ చెన్నై తరహాలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు సముద్రపు నీటిని శుద్ధి చేసి వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్‌కు గొర్రిపాటి పేరును పునరుద్ధరించాలని అసెంబ్లీలో కూడా ప్రస్తావించామని తెలిపారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కాంట్రాక్టర్ల భారీ వాహనాల కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో రహదారులు పాడైపోయాయని చెప్పారు. జిందాల్‌ అల్యూమినియం ఫ్యాక్టరీకి చేసిన భూసేకరణ, రైతుల సమస్యలను ప్రస్తావించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ పారాది వంతెన దెబ్బతినడం వల్ల ట్రాఫిక్‌ను మళ్లించడంతో నియోజకవర్గంలోని పలు రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. వచ్చే వర్షాకాలంలోగానే వంతెన నిర్మణాన్ని పూర్తి చేయాలని కోరారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను ప్రస్తావించారు. ఎపి మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసితుల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ సురేష్‌బాబు, తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్విని, ఎస్‌పి వకుల్‌ జిందాల్‌, జెసి ఎస్‌.సేతు మాధవన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రతీ జిల్లాలో ఈగల్‌ బృందాలు
త్వరలో ప్రతీ జిల్లాలో ఈగల్‌ బృందాలను ఏర్పాటుచేస్తామని హోమంత్రి అనిత తెలిపారు. కలెక్టరేట్‌లో ఆమె మీడియాంతో మాట్లాడుతూ గంజాయి సాగును, రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. దీనిలో భాగంగా ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈగల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.9 కోట్లు ఖర్చుచేయనుందని చెప్పారు.

➡️